కరోనా సెకండ్ వేల్ దేశాన్ని అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సెకండ్ వేవ్ కేసుల్లో చాలావాటికి ఆక్సిజన్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలెండర్ల కొరత వేధిస్తోంది. ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలిగిన విశాఖ స్టీల్స్ వంటి కర్మాగారాలను భారీ స్థాయిలో ఆక్సిజన్ సిలెండర్లు ఉత్పత్తి చేయాల్సిందిగా ఆయా రాష్ట్రప్రభుత్వాలు ఆదేశించాయి. అయినప్పటికీ చాలాచోట్ల ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఉంది.
ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆన్ లైన్లో ఆక్సిజన్ మిషన్లకు గిరాకీ పెరిగింది. సీరియస్ కండిషన్లలో ఉన్నవారికి మాత్రమే హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ని పెడుతున్నారు. కానీ చాలామంది కోవిడ్ పేషెంట్లకు ఊపిరి ఆడని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఆక్సిజన్ మిషన్లు సహకరిస్తున్నాయి. ముఖ్యంగా హోమ్ ఐసోలేషన్ లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ సంజీవనిలా మారింది.
దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు డిమాండ్ పెరిగింది. ఇంట్లోనే ఆక్సిజన్ పెట్టుకోవడంపై కొందరు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో, హోం ఐసోలేషన్ లో ఉన్నవారికి, ఆసుపత్రుల్లో బెడ్లు దొరక్క ఇబ్బంది పడుతున్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతోంది. వీటి ధర 50వేల నుంచి లక్ష వరకూ కూడా ఉంది. ఇంత ధర పెట్టి కొనలేని వారికి అద్దెకి కూడా ఇస్తున్నారు.
చూడటానికి వాటర్ ఫ్యూరిఫైయర్ లా కనిపించే ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్ ను ఈజీగా మోసుకెళ్లవచ్చు. అయితే వీటిని వాడే ముందు డాక్టర్ల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.