అగ్గిపుల్ల…కుక్క పిల్ల…సబ్బు బిళ్ల కాదేది కవితకనర్హం…అన్న శ్రీశ్రీ కవితను ఆదర్శంగా తీసుకున్న జగన్ ఏపీలో కాదేదీ పన్నుకనర్హం అన్న రీతిలో ప్రజలపై పన్ను పోటుతో విరుచుకుపడుతున్నారన్న విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తుగ్లక్ ను తలపించేలా ఇటీవలి కాలంలో జగన్ చెత్తపై కూడా పన్ను వేయడంపై ప్రతిపక్షాలు చెత్తెత్తిపోస్తున్నాయి. చెత్తపై పన్ను వేసిన ఏకైక సీఎం జగన్ అని, ఏపీలో చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం నడుస్తోందని, రేపు జుట్టుకూ పన్ను వేస్తారేమో గుండ్లు కొట్టించుకోండంటూ చంద్రబాబు చురకలంటించారు.
అయినా సరే వెనక్కు తగ్గని జగన్ తాజాగా చెత్త పన్ను వసూళ్లపర్వం మొదలుబెట్టారు. అసలే చెత్తపన్ను…అని జనం గగ్గోలు పెడుతుంటే…పన్ను ఎందుకు కట్టాలి అని అడిగిన వారిపై మున్సిపల్ సిబ్బంది చెత్త పని చేయడం హాట్ టాపిక్ గా మారింది. చెత్తపై పన్ను ఎందుకు కట్టాలని ప్రశ్నించిన షాపుల యజమానులను కర్నూలు నగరపాలక సంస్థ సిబ్బంది ఘోరంగా అవమానించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కర్నూలులోని కొండారెడ్డి బురుజు సమీపంలోని అనంత కాంప్లెక్స్ లో ఉన్న షాపుల దగ్గర చెత్త పన్ను వసూలుకు వార్డు సచివాలయ సిబ్బంది, మునిసిపల్ సిబ్బంది వెళ్లారు. ఆస్తి పన్ను, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వంటి అనేక రుసుములు చెల్లిస్తున్నామని, ఇక చెత్తపై పన్ను ఎందుకు కట్టాలని షాపుల యజమానులు వారిని నిలదీశారు. దీంతో, వారికి, మున్సిపల్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దుకాణదారుల వాదనతో మండిపడ్డ మున్సిపల్ సిబ్బంది…నగరవ్యాప్తంగా సేకరించిన చెత్తను అక్కడికి తెప్పించి అనంత కాంప్లెక్స్ షాపుల ముందు పడేసి వెళ్లారు.
పన్ను ఎందుకు చెల్లించాలని అడిగినందుకు తమ షాపుల ముందు చెత్త వేసి వెళ్లారని, దీంతో, తాము షాపులు మూసేయాల్సి వచ్చిందని వారు వాపోతున్నారు. తమను అవమానించేలా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని షాపుల యజమానులు డిమాండ్ చేస్తున్నారు. మరి, ఈ వ్యవహారంపై మున్సిపల్ సిబ్బంది, అధికారుల స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు, వైసీపీ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు బాదేస్తోందని, సామాన్యులపై పన్నుల భారం నానాటికీ పెరిగిపోతోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నిరు. నానాటికీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, డీజిల్ , పెట్రోల్ రేట్లు, పన్నుల బాదుడు, ఆఖరికి చెత్తపై కూడా పన్ను వంటి అంశాలు మధ్యతరగతి జనాన్ని చికాకు పెడుతున్నాయని విపక్ష నేతలు మండిపడుతున్నారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి….పెన్షన్ల వంటివి పెంచుకుంటూ పోవాల్సిన జగన్….రివర్స్ లో వస్తున్నారని, కరెంట్ ఛార్జీలు, ఆస్తి పన్నులు, రిజిస్ట్రేషన్ చార్జీలు, చెత్తపై పన్నులు పెంచుకుంటూ….పోతూ జనం నడ్డి విరుస్తున్నారని విమర్శిస్తున్నారు. చెత్త పన్నుపై ప్రశ్నిస్తే ‘చెత్త’ పోయిస్తావా జగన్?…అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.