పీఆర్సీ పెంపుతో పాటు సీపీఎస్ రద్దు వంటి ఇతర సమస్యలపై ప్రభుత్వ ఉద్యోగులు కొంతకాలంగా ప్రభుత్వంతో ఫైట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముందు ఉద్యోగ సంఘాలను లైట్ తీసుకున్న జగన్….వారు పోరు బాట పట్టడంతో ఎట్టకేలకు దిగి వచ్చారు. నాన్చి నాన్చి ఎట్టకేలకు ఉద్యోగులకు 23.29 శాతం ఫిట్మెంట్ను నేడు ఖరారు చేశారు. ఆల్రెడీ ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద ఇస్తున్న 27 శాతం కన్నా మూడున్నర శాతం తగ్గించారు.
ఈ లెక్క ప్రకారం అయితే ఉద్యోగుల జీతం తగ్గాల్సి ఉంటుంది. కానీ, దానిని వేరే రకంగా మేనేజ్ చేసి ఉద్యోగుల జీతాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందట. ఇక, ఫిట్ మెంట్ తగ్గింపుతో అసహనానికి గురైన ఉద్యోగులను బుజ్జగించేందుకు జగన్ మరో ఎత్తుగడ వేశారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 2014లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 57 నుంచి 60కి చంద్రబాబు హయాంలో పెంచారు.
వాస్తవానికి ఈసారి ఉద్యోగ సంఘాలు వయసు పరిమితి పెంచాలని డిమాండ్ చేయలేదు. కానీ, అనూహ్యంగా రిటైర్మెంట్ వయసును పెంచాలని జగన్ నిర్ణయించడంతో ఉద్యోగులు కూడా ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. అయితే, దీనిలోనూ జగన్ లెక్క వేరే ఉందని తెలుస్తోంది. వయసు పెంపుతో మరో రెండేళ్ల పాటు రిటైరయ్యే ఉద్యోగులుండరు. దీంతో, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ డబ్బులు మిగులుతాయి.
ఆల్రెడీ రిటైర్ అయిన ఉద్యోగులకు సెటిల్ చేయాల్సిన మొత్తం భారీగా పెండింగ్లో ఉందట. వారికి పెండింగ్ నగదు క్లియర్ చేసేందుకే ఈ రెండేళ్ల పెంపును చేపట్టారని తెలుస్తోంది. తాజా పీఆర్సీ జనవరి ఒకటో తేదీ నుంచే అమల్లోకి వస్తుంది. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై అదనంగా రూ.10వేల కోట్లకు పైగా భారం పడుతుందని అంచనా.