ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయి నేతల పర్యటనల భద్రత విషయంలో పోలీసు ఉన్నతాధికారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. జడ్ కేటగిరీ, వై కేటగిరీ భద్రత ఉన్న ఆ నేతల కార్యక్రమం తేదీకి వారం రోజుల ముందే కార్యక్రమం నిర్వహించబోయే ప్రాంతంలో కనీసం ఎస్పీ స్థాయి అధికారి పర్యటిస్తారు. అంతేకాదు, ఆ పర్యటన సందర్భంగా ఆ నేతల వెంట ఉండబోయే పోలీసు అధికారులు ఎవరో అన్న జాబితాను కూడా ముందుగానే నిర్ణయియస్తారు.
ఇటువంటి నేపథ్యంలోనే వై కేటగిరీ భద్రత ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి దర్జాగా పొల్గొని హల్ చల్ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో పవన్ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ సైలెంట్ గా పాల్గొన్నారన్న వ్యవహారం సంచలనం రేపుతోంది. తీరా డిప్యూటీ సీఎంవో అధికారులు ఆరా తీయడంతో ఆ ఫేక్ ఐపీఎస్ వ్యవహారం ఈ రోజు బట్టబయలైంది.ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ఏపీ హోం శాఖా మంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. ఆల్రెడీ ఆ నకిలీ ఐపీఎస్ సూర్య ప్రకాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, పవన్ పై వీరాభిమానంతోనే అలా చేశానని అతను చెబుతున్నాడట. కానీ, పవన్ పై కుట్ర కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు.