‘ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా చెప్పలేదు. విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు’ అని వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్…ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తీరుపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తనకు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వడాన్ని ఆక్షేపించారు.
వైసీపీకి విపక్ష హోదా ఇవ్వరాదని ముందే నిర్ణయించుకున్నారా ? అని లేఖలో ప్రశ్నించారు. ముఖ్యమంత్రి, మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం అసెంబ్లీ నియమావళికి విరుద్ధమని ఉటంకించారు.
అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంతో పాటు స్పీకర్ కూడా శత్రుభావంతో వ్యవహరిస్తున్నారని, చచ్చేదాకా కొట్టాలంటూ స్పీకర్ మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో తాము గొంతు విప్పి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయని భావించడంలోదని జగన్ తన లేఖలో వెల్లడించారు.
ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడే సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు చట్టబద్ధ భాగస్వామ్యం ఉంటుందని, ఈ నేపథ్యంలో తమ లేఖను పరిశీలించి ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోవాలని జగన్ పేర్కొన్నారు.