గుండెల్లో ఏదో ఉంది. దాన్ని బయటపెట్టాలని మనసు బలంగా చెబుతోంది. కానీ.. అంతలోనే ఏదో గుర్తుకు వచ్చినట్లుగా ఆగటం.. అంతలోనే.. ఏమైతే అదైంది.. అనుకున్నది చెప్పేద్దామన్న తలంపు.. ఇలా తరచూ మనసులోని అంతర్మధనమో మరేదో కానీ.. తెలంగాణ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ నోటి నుంచి వచ్చే మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. వార్తాంశాలుగా మారుతున్నాయి.
మనసులో ఉన్నది చెప్పేసుకుంటే సరిపోయేదానికి ఏదో శంక.. ఈటెలను ఆపేస్తున్నట్లుగా ఉంది. ఇటీవల కాలంలో ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు తరచూ ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఏదో చెప్పాలన్న ఆత్రుత.. ఆవేశంతో పాటు.. తాను కాకుంటే ఇంకెవరు మాత్రం చెప్పగలరన్న భావన ఆయన మాటల్లో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన హుజూరాబాద్ నియోజకవర్గం వీణవంక మండలం రైతు వేదికల్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి.
ఈటెల మాటల్ని విన్నంతనే.. రాజుగారి చిన్న కోడలు మంచిదన్న సామెత గుర్తుకు వచ్చేలా ఉండటం గమనార్హం. ఆయన మాటల్లో అంతర్లీనంగా ఏదో శ్లేష కనిపించక మానదు. ఇటీవల వెల్లడైన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల నేపథ్యంలో ఆయన మనసులో జరుగుతున్న అంతర్మధనానికి సాక్ష్యంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు ఉన్నాయా? అన్న భావన కలుగక మానదు.
- నాయకులంటే భారీ ఆకారంతో, అభరణాలతో, కులంతో పని ఉండదు ప్రజల కన్నీళ్ళు చూసి స్పందించే వాడే నిజమైన నాయకుడు, నిజమైన మనిషి.
- కులం.. డబ్బు.. పార్టీ జెండాను కాదు. మనిషిని గుర్తు పెట్టుకోవాలి
- ధర్మం.. న్యాయం తాత్కాలికంగా ఓడిపోవచ్చు కానీ శాశ్వతంగా ఓడిపోదు
- నేను గాయపడినా నా మనసు మార్చుకోలేదు. 20 ఏళ్ల ప్రస్థానంలో ప్రజలు నన్నెంతో ఎత్తుకు తీసుకెళ్లారు
- మహాభారతంలో కౌరవులు.. ధుర్యోధనుడు ఉండబట్టే పాండవులకు అంత పేరు వచ్చింది
- రామాయణంలో కూడా రాముడు ఉన్నాడు. రావణుడు ఉన్నాడు. అలాగే మన సమాజంలో కూడా అందరూ ఉంటారు.అందరూ ఒకే విధంగా ఉండరు. అనాటి నుంచి ఈనాటి వరకు మొత్తంగా ఒకటిగా ఉండదు. ఉంటే.. అది సమాజం కాదు.