గత ఏడాది ఫిబ్రవరిలో బెంగళూరుకు చెందిన కన్నడ చిత్ర నిర్మాత శంకర్ గౌడకు డ్రగ్స్ కేసులో నోటీసులు రావడం టాలీవుడ్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ నిర్మాతతో తెలుగు హీరో తనీష్ కు సంబంధాలున్నాయని, అందుకే తనీష్ కు కూడా నోటీసులు వచ్చాయని మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక, ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ కు చెందిన కొందరి పేర్లతోపాటు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తలు, ఎమ్మెల్యేల పేర్లు వెల్లడైనట్టు ప్రచారం జరిగింది.
బెంగళూరులో పబ్ లు హోటల్స్ నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు రతన్ రెడ్డి, కలహర్ రెడ్డిలకు ఈ కేసుతో సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. శంకర్ గౌడ కుమార్తె బర్త్ డే పార్టీలో హైదరాబాద్ వ్యాపారి సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డిలతో పాటు తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే, శ్రీను రెడ్డి అనే మరో వ్యక్తి పాల్గొన్నారని పోలీసులు గుర్తించినట్లు గతంలో ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో పాటు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లకు ఈడీ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని తనకు ఈడీ నోటీసులు వచ్చాయని, కానీ, ఇంకా చదవలేదని రోహిత్ కూడా కన్ ఫర్మ్ చేశారు. తన వ్యాపారాలు, ఐటీ రిటర్న్స్, కుటుంబ సభ్యుల ఖాతాల వివరాలు అడిగారని ఆయన వెల్లడించారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో వార్తల్లో నిలిచిన రోహిత్ రెడ్డికి తాజాగా ఈడీ నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరోవైపు, ఈ నోటీసుల వ్యవహారంపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందించాల్సి ఉంది. గతంలో కూడా రకుల్ డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే.