దాదాపు ఏడాది క్రితం.. అప్పుడప్పుడే కరోనా కేసులు అడపాదడపా వెలుగు చూస్తున్నాయి. కరోనా పాజిటివ్ వచ్చిందంటే చాటు.. ఆ ప్రాంతం మొత్తం.. ఆ వీధి మొత్తం ఆగమాగమైపోయే పరిస్థితి. అటువైపు వెళ్లేందుకు సైతం జనాలు హడలిపోయే వారు. అలాంటివేళలో.. అత్యవసరమైతే తప్పించి ఇంట్లో నుంచి బయటకు రావొద్దంటూ హెచ్చరికలు వినిపించేవి. ఏడాది వ్యవధిలో ఎన్ని అనుభవాలు ఎదురవ్వాలో అన్ని అయిపోయాయి. కరోనా వెళ్లిపోయిందంటూ సంబరపడిపోయే వారికి షాకిస్తూ.. మరోసారి తన తఢాఖా చూపేందుకు వచ్చేసింది.
దేశంలోని ఐదు రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పెద్దగా లేని పరిస్థితి. అందుకు భిన్నంగా రెండు వారాల వ్యవధిలోనే తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. అదిప్పుడు ఆందోళన కలిగించే దిశగా టర్న్ తీసుకుంటుందన్న మాట వినిపిస్తోంది. మిగిలిన చోట్ల ఎలా ఉన్నా విద్యా సంస్థలు.. హాస్టళ్లలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. అది కూడా టోకుగా రావటంతో హడలిపోతున్నారు.
ఇలాంటివేళ.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. ఇలాంటివేళ రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఈటెల రాజేందర్ రియాక్టు అయ్యారు. కరోనా పరిస్థితి మీద రివ్యూ చేసిన ఆయన.. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని తేల్చారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని కోరిన ఆయన.. కేసులు పెరిగితే రోగులకు సరిపడా ఆసుపత్రుల్ని సిద్ధంగా ఉంచాలన్నారు.
అంతేకాదు.. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దంటూ తొలి హెచ్చరికను చేసేశారు. ఏడాది క్రితం కూడా తొలుత అత్యవసరమైతే తప్పించి బయటకు రావొద్దన్న ప్రభుత్వం.. తర్వాతి దశాల్లో పరిమితుల్ని పెంచేయటం తెలిసిందే. అప్పటి మాదిరి లాక్ డౌన్ విధించే అవకాశాలు లేకున్నా.. ఆంక్షలు మాత్రం పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.