ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దంపతులు పుత్ర సమేతంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతు న్న మహాకుంభమేళాలో పాల్గొన్నారు. మంగళవారం సాయంత్రం వేళ.. పవన్ కుటుంబ సమేతంగా పుణ్య స్నానాలు చేశారు. శాస్త్రోక్తంగా త్రివేణీ సంగమానికి ప్రత్యేకంగా పూజలు చేశారు. అర్ఘ్యం సమర్పించారు. పండితుల సూచనల మేరకు గంగా నదికి పసుపు కుంకాలు సమర్పించారు. మూడు మునకలు వేసి.. పుణ్యస్నానం పూర్తి చేశారు. కాగా.. అందరిలాగా కాకుండా.. పవన్ కల్యాణ్ హాప్ నేక్డ్గా పుణ్య స్నానం చేయడం గమనార్హం.
అయితే.. ఈ పుణ్యస్నానం వీడియోలు బయటకు వచ్చిన తర్వాత.. సోషల్ మీడియాలో కామెంట్లు కురుస్తున్నాయి. దీనికి కారణం.. పవన్ కల్యాణ్.. భుజంపై `జంధ్యం` కనిపించడమే!. సాధారణంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, కంసాలి సామాజిక వర్గాలు మాత్రమే జంధ్యం ధరిస్తారు. ఇతర వర్ణాల వారికి జంధ్యం ధరించే సంప్రదాయం లేదు. కానీ, పవన్ కల్యాణ్ మెడలో జంధ్యం కనిపించింది. వాస్తవానికి ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో ఆ సామాజిక వర్గంలో జంధ్యం ధరించే సంప్రదాయం లేదు. ఈ నేపథ్యంలో పవన్ మెడలో జంధ్యం కనిపించడం ఆసక్తిగా మారింది.
దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ అపవిత్రం అయిందన్న ఆరోపణలు వచ్చినప్పుడు పవన్ సనాతన ధర్మ దీక్ష చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఆయన ఇంట్లోనే యాగం కూడా చేశారు. ఈ సమయంలోనే ఆయన జంధ్యం ధరించి ఉంటారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే.. అప్పుడు కాదు.. మహాకుం భమేళాకు వెళ్లినప్పుడు వేసుకుని ఉంటారని మరికొందరు చెబుతున్నారు.
ఇంకొందరు.. ఎప్పటి నుంచో పవన్ జంధ్యం వేసుకుంటున్నారని అంటున్నారు. కానీ, దీనిపై క్లారిటీ లేదు. వాస్తవానికి కాపు సామాజిక వర్గంలో జంధ్యం లేదు. కాబట్టి.. పవన్ సనాతన ధర్మ దీక్ష చేసినప్పుడే.. జంధ్యం వేసుకుని ఉంటాడన్నది మెజారిటీ నెటిజన్ల అభిప్రాయం. ఏదేమైనా పవన్ చేసిన స్నానం కంటే.. ఆయన వేసుకున్న జంధ్యంపైనే ఎక్కువగా చర్చ సాగుతుండడం గమనార్హం. మరోవైపు.. ఆయన కేవలం పంచె ధరించే పుణ్యస్నానానికి దిగడం కూడా.. ఆశ్చర్యంగా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. సాధారణంగా సెలబ్రిటీలు.. మంత్రులు కూడా పూర్తి వస్త్రాలతోనే పుణ్యస్నానాలు చేశారు. ప్రధాని మోడీ పూర్తి వస్త్రాలతోనే స్నానం చేయడం గమనార్హం.