టీడీపీ-జనసేన మిత్రపక్షానికి పరీక్షా కాలం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేనిదే గెలవలేమని నిర్ణయానికి వచ్చిన ఈ మిత్రపక్షానికి.. ఇప్పుడు అదే బీజేపీ పెద్ద సంకటంగా మారింది. పార్లమెంటు స్థానాల్లో 25కు మొత్తం 8 స్థానాలను తమకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. అయితే.. మీకు అంత శక్తి లేదని.. 2014లో ఇచ్చిన స్థానాల్లో కేవలం రెండు(విశాఖ, నరసాపురం) చోట్ల మాత్రమే మీరు విజయం సాధించారని.. కాబట్టి మీరు అంతగా పట్టుబడుతున్నారు కాబట్టి నాలుగు తీసుకోండని చంద్రబాబు, పవన్‌లు నచ్చ చెబుతున్నారు.
అయితే.. ఈ విషయాన్ని బీజేపీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు మోడీ గ్రాఫ్ పెరిగిందని.. ఏపీలో తన్నుకుంటూ గెలుస్తామని.. తమకు అడ్డు వచ్చే వారు ఎవరూ లేరని బీజేపీ అగ్రనేత అమిత్ షా వ్యాఖ్యానించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో చర్చల వ్యవహారం సీట్ల దగ్గర ఎటూ తేలకపోవడంతో మరో రోజు కూడా చంద్రబాబు, పవన్‌లు ఢిల్లీలోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి శుక్రవారం రాత్రికే వారు ఏపీకి చేరుకోవాల్సి ఉంది. ఈ మేరకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు.కానీ, చర్చలు కొలిక్కి రాకపోవడంతో శనివారం వరకు కూడా అక్కడే ఉండిపోయే పరిస్థితి వచ్చింది.
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం .. బీజేపీ అరకు, అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి నరసాపురం, మచిలీపట్నం, తిరుపతి, రాజంపేట పార్లమెంటు స్థానాలకు పట్టుబడుతోంది. వీటిలో రాజమండ్రి, నరసాపురం, తిరుపతి, రాజంపేట స్థానాలను ఇచ్చేందుకు టీడీపీ, జనసేన మిత్రపక్షం సిద్ధంగానే ఉంది. అయితే.. మిగిలిన నాలుగు స్థానాలను కూడా బీజేపీ పట్టుబడుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర బీజేపీ నేతలు ఇచ్చిన నివేదికను కూడా చంద్రబాబు, పవన్‌లకు చూపించి.. ఆ స్థానాల్లో తమ గ్రాఫ్ ఎలా పెరిగిందో వివరించినట్టు సమాచారం. కానీ, క్షేత్రస్థాయిలో తాము సేకరించిన సమాచారం దీనికి భిన్నంగా ఉందని చంద్రబాబు చెప్పారని తెలిసింది. మొత్తానికి బీజేపీ-మిత్రపక్షం మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం.. సంకటంగా మారింది. చివరకు ఏం చేస్తారో చూడాలి.