ఏపీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 25న బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. ఇది వచ్చే ఏడు మాసాలకు సంబంధించిన బడ్జెట్టే అయినా.. కీలకమైన బడ్జట్ అనేది తెలిసిందే. ప్రభుత్వ మార్కు చూపించే బడ్జెట్. పైగా పథకాల మాట ఎలా ఉన్నప్పటికీ… శాఖల పరంగా చేపట్టాల్సిన పనులకు బడ్జెట్ ప్రతిపాదనలు చాలా ముఖ్యం. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. ఈ బడ్జెట్‌పై ఏ మేరకు ముద్ర వేస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
ఎందుకంటే.. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న పవన్.. సమీక్షల సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా.. వైసీపీ ప్రభుత్వం నిధులు లేకుండా చేసిందన్నారు. అదేవిధంగా దోమల మందు పిచికారీ చేసేందుకు కూడా.. సర్కారు వద్ద ఖజానా లేదన్నారు. ఇక, అటవీ శాఖపై నిర్వహించిన సమీక్షలో అటవీ శాఖ అధికారులకు పాతబడిన వాహనాలు ఇస్తున్నారని.. వారికి కనీసం.. మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేక పోతున్నారని అన్నారు.
అదేసమయంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచాల్సిన అవసరం ఉందని.. గత ప్రభుత్వం వీటిని గాలికి వదిలేసిందని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ప్రవేశ పెట్టనున్న బడ్జెట్లో పవన్ కోసమైనా… ఆయా శాఖలకు నిధులు కేటాయిస్తారా? అనేది ప్రశ్న. గ్రామీణ ప్రాంతాల్లో దోమల మందు పిచికారీ సేందుకు రూ.20 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.
అదేవిధంగా బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు చేసేందుకు రూ.50 కోట్లు కావాలన్నారు. ఇక, అటవీ శాఖ అధికారులకు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా.. రూ.20 కోట్లు కావాలని పేర్కొన్నారు. మరి ఈ నిధులు కేటాయిస్తారా? లేదా? అనేది చూడాలి. ఇంటీరియం బడ్జెట్.. పైగా కూటమి సర్కారు తొలి బడ్జెట్ కావడంతో పవన్ ఈ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించే ఉంటారు. సో.. ఏమేరకు నిధుల కేటాయింపు ఉంటుందో చూడాలి.