జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఏదోలా టార్గెట్ చేయాలని.. ఆయన ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీయాలన్న తలంపు వైసీపీ పరివారానికి ఉండొచ్చు. దాన్ని తప్పు పట్టలేం. ఎందుకంటే పవన్ కానీ కూటమిలో భాగస్వామ్యం కాకుంటే తమ చేతిలోనే మరిన్నిరోజులు అధికారం తమ చేతిలోనే ఉంటుందని ఫీల్ కావటం తప్పు కాదు. అలా అని ఏదో ఒకటి చేసి తప్పుడు పనులు చేస్తున్నారన్న భావన కలిగేలా ఫేక్ వీడియోలను క్రియేట్ చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అధికారంలోకి వచ్చి.. డిప్యూటీ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న పవన్.. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత శత్రువు కాదని.. రాజకీయంగా ఆయన తీరును తాను వ్యతిరేకిస్తున్నానే తప్పించి.. మరెలాంటి ఉద్దేశాలు తనకు లేవని అదే పనిగా స్పష్టం చేస్తున్నారు.
ఇలాంటి వేళ.. పవన్ ను టార్గెట్ చేయటం ద్వారా వైసీపీ బ్యాచ్ కు నష్టమే తప్పించి లాభం కలగదు. చిన్న ఉదంతాల్ని తమకున్న సోషల్ నెట్ వర్కుతో వైరల్ చేయొచ్చు. దానికి కౌంటర్ గా అసలు నిజం ఏమిటన్న విషయాన్ని అధికారంలో ఉన్న వారు ప్రచారం చేస్తే ఉన్న కాస్తంత పరువు.. మర్యాదలు మంటగలుస్తాయన్న చిన్న లాజిక్ ను వైసీపీ వర్గీయులు మిస్ అవుతున్నారు. తాజాగా పవన్ ను బద్నాం చేసేందుకు చేసిన ఒక ప్రయత్నం ఫెయిల్ కావటమే కాదు.. వైసీపీ వర్గీయులకు బ్యాక్ ఫైర్ అయిన వైనం ఒక పాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
అసలేం జరిగిందంటే.. అమరావతిలో పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో వివిధ అంశాల మీద డిప్యూటీ సీఎం.. ఆ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ సమీక్ష చేపట్టారు. ఆ తర్వాత విలేకరుల సమావేశాన్నినిర్వహించారు. ఈ సందర్భంగా మైక్ సరిగా లేకపోవటంతో.. తన చేతిలోని హ్యాండ్ మైక్ ను కింద పెట్టేసి వేగంగా వెళ్లి.. అక్కడే డయాస్ మీద ఉన్న మైక్ లో మాట్లాడారు. జరిగింది ఇదైతే.. సుగాలి ప్రీతి కేసుపై విలేకరులు ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పకుండా కోపం.. అసహనంతో మైకు విసిరేసి వెళ్లినట్లుగా ఒక ఫేక్ వీడియోను తయారు చేసి వైరల్ చేశారు.
దీనికి కౌంటర్ గా అసలేం జరిగింది? వాస్తవం ఏమిటి? ఫేక్ వీడియో వర్సెస్ ఒరిజినల్ వీడియో అంటూ పవన్ అభిమానులు రంగంలోకి దిగి అసలు విషయాన్ని కళ్లకు కట్టేలా పోస్టు చేశారు. దీంతో.. ఈ వీడియో వైరల్ గా మారింది. వైసీపీ వర్గీయులు చేస్తున్న అసత్య ప్రచారంపై మండిపడుతున్నారు. ఈ తరహా వీడియోలతో పవన్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలన్న అతితెలివి ప్రదర్శించే వారిని ప్రోత్సహించకూడదు. ఇలాంటి వారి తీరును వైసీపీ వర్గీయులు ఖండించటం ద్వారా ఉన్న కాస్తంత విలువను కాపాడుకోవాల్సి ఉంటుంది. లేదంటే.. రేపొద్దున నిజంగానే పవన్ తప్పు చేసినప్పుడు కూడా నమ్మే పరిస్థితి ఉండదు. నాన్న.. పులి కథలా పరిస్థితి మారుతుందన్నది గుర్తిస్తే మంచిది.