నా కాలు మీద నా కాలు వేసుకుంటే.. ఆయన గౌరవం తగ్గేదేంటి? నేనిచ్చానని చెప్పి ఈ వంద ఇచ్చి బజార్లో మర్యాదను కొనుక్కోమంటూ పుష్పలో హీరో పాత్రధారి నోటి నుంచి వచ్చిన మాటల్ని విన్నప్పుడు.. ఆత్మాభిమానం ఉన్నోళ్ల మాటలు ఎలా ఉంటాయన్నది ఇట్టే అర్థమవుతుంది. తాజాగా మధ్యప్రదేశ్ కు చెందిన ఒక పోలీసు కానిస్టేబుల్ మాటల్ని విన్నప్పుడు.. పుష్ప మూవీలో హీరో పాత్ర చప్పున గుర్తుకు రాక మానదు. ఇంతకూ అసలేమైందన్న విషయంలోకి వెళితే..
మధ్యప్రదేశ్ కు చెందిన రాకేశ్ రానా అన్న వ్యక్తి పోలీసు కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆయన మీసాల్ని ట్రిమ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే.. సదరు కానిస్టేబుల్ ససేమిరా అన్నారు. మీసాల్ని ట్రిమ్ చేసేదే లేదని తేల్చి చెప్పారు. దీంతో.. అధికారుల ఆదేశాల్ని అమలు చేయని వైనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయన్ను సస్పెండ్ చేశారు.
పోలీసు శాఖలో ఈ తరహా వైఖరిని ఒప్పుకోమని.. మీసాల్ని మెడ వరకు పెంచటం సరికాదని స్పష్టం చేశారు. రాకేశ్ ను చూసిచూడనట్లు వదిలేస్తే.. మిగిలిన వారి మీదా అతని ప్రభావం పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ కారణంతోనే అతనిపై చర్యలు తప్పలేదంటున్నారు. ఇదిలా ఉంటే.. తనను సస్పెండ్ చేసినప్పటికీ తాను మీసాల్ని ట్రిమ్ చేసే ప్రసక్తే లేదని చెబుతున్నాడు రాకేశ్.
విధి నిర్వహణలో తనపై ఎలాంటి ఫిర్యాదులు లేవని.. తాను రాజ్ పుత్ వంశం నుంచి వచ్చానని.. అలాంటి మీసాలే తమకు గర్వకారణమని అతడు చెబుతున్నాడు. మీసాలు తమ ఆత్మగౌరవానికి ప్రతీకలని.. అందుకోసం సస్పెండ్ అయినా ఫర్లేదని చెబుతున్నాడు. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదన్న అతడి మాటలు.. మొండితనం చూస్తే.. పుష్ప మూవీలో హీరో పాత్రధారి గుర్తుకు రాక మానదు.