తెలంగాణ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి ఏపీ సీఎం జగన్ సర్కారుపై తీవ్రస్థాయిలో విమ ర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో ఆమె మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాలను ప్రస్తావించారు. ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుందనే విషయాన్ని ఆమె చెప్పకపోయినా.. కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్నారు. బీజేపీ దేశాన్ని నాశనం చేశారని చెప్పిన రేణుక.. ఏపీని కూడా నాశనం చేసేందుకు బీజేపీ వస్తోందని మండిపడ్డారు. బీజేపీ వల్ల ఏపీ చాలా నష్టపోయిందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ చెబితే.. బీజేపీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇక, జగన్తీసుకువచ్చిన మూడు రాజధానులను ప్రస్తావిస్తూ.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. “మూడు రాజధానులు అంటే ఏంటి? ఒకటి డ్రగ్స్ రాజధాని విశాఖపట్నం. మొన్నే 25 వేల కిలలో డ్రగ్స్‌ను పట్టుకున్నారు. రెండు.. మర్డర్స్ రాజధాని.. అది కర్నూలు.. సీమ ప్రాంతం. అక్కడ ఇప్పటికీ హత్యలు జరుగుతున్నాయి. వీటిని ఆపడం చేతకాని చేవలేని ప్రభుత్వం. మూడో రాజధాని నిరుద్యోగం. ఇది విజయవాడ. ఇక్కడ నిరుద్యోగ యువత ఆపశోపాలు పడుతున్నా.. పట్టించుకునే తీరిక లేదు. ఇవేనా ప్రఖ్యాతి గడించిన జగనన్న తీసుకువచ్చే మూడు రాజధానులు“ అని రేణుక పెదవి విరిచారు.
మూడు రాజధానులు అంటూ టైం వేస్ట్ చేశారని అన్నారు. అమరావతి వంటి బంగారు బాతును నాశనం చేసుకున్నారని విమర్శించారు. మూడు రాజధానులు అని చెబుతున్న జగన్ ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేక పోయారని చెప్పారు. కీలకమైన ఎన్నికల సమయంలో అన్ని పార్టీలూ ప్రజా సమస్యలను వదిలేశాయన్న రేణుక.. ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తోందన్నారు. అయితే.. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారా? లేదా? అనేది తాను చెప్పలేనని అన్నారు.