తెలంగాణాలో ప్రభుత్వం మారగానే ఒక్కో ఐఏఎస్ అధికారి బాగోతం బయటపడుతోంది. ముందు సోమేష్ కుమార్, తర్వాత అర్వింద్ కుమార్, తాజాగా రజత్ కుమార్ వ్యవహారం వెలుగుచూస్తోంది. వీళ్ళ ముగ్గురి వ్యవహారంలో కామన్ పాయింట్ ఏమిటంటే బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారని ఆరోపణలు వచ్చాయి. దీనికి కారణం సుదీర్ఘకాలం తాము కోరుకున్న స్ధానాల్లోనే పాతుకు పోయారు. కేసీయార్, కేటీఆర్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. దాంతో వీళ్ళ పర్యవేక్షణలోని శాఖల్లో నియమ, నిబంధనలకు పాతరేసినా అడ్డుచెప్పిన వాళ్ళు లేరని కాంగ్రెస్ ఆరోపించింది.
అయితే ప్రభుత్వం మారగానే వీళ్ళ వ్యవహారాలన్నీ ఒక్కోటిగా బయటపడుతున్నాయి. సోమేష్ కుమార్ చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. కేసీయార్ కు అత్యంత సన్నిహితులైన ఉన్నతాధికారుల్లో తాను కూడా ఒకడిగా గుర్తింపు పొందటానికే ఈయన తహతహలాడారనే ఆరోపణలున్నాయి. అందుకనే నియమ, నిబంధనలతో సంబంధంలేకుండా కేసీయార్ ఏదిచెబితే అదల్లా చేశారట. తాజాగా 28 ఎకరాల కొనుగోలు వ్యవహారం బయటపడింది. తనభార్య, బంధువుల పేర్లతో అత్యంత తక్కువ ధరకే ఇన్ సైడ్ ట్రేడింగ్ పద్దతిలో కారుచౌకగా భూములు కొట్టేశారని ఆధారాలతో సహా బయటపడింది.
ఇక హెచ్ఎండీఏ డైరెక్టర్ గా పనిచేసిన శివ బాలకృష్ణ వ్యవహారం ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎంతోమంది ఐఏఎస్ అధికారులు బాలకృష్ణ ద్వారా బాగా లబ్దిపొందారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి. వీటిల్లో తాజా అర్వింద్ కుమార్ విషయం బయటపడింది. ఆరోపణల ప్రకారం రియాల్టర్ల నుండి అర్వింద్ సుమారు రు. 20 కోట్ల మేరకు లబ్ధి పొందినట్లు సమాచారం. అర్వింద్ తరపున బాలకృష్ణే వ్యవహారాలను చక్కబెట్టేవారట. ఇప్పటికే ఫార్ముల ఈ రేస్ వ్యవహారంలో రు. 55 కోట్ల కుంభకోణంలో అర్వింద్ తగులుకున్నారు. అలాగే రజత్ కుమార్ అనే మరో ఐఏఎస్ విషయం కూడా బయటపడింది. ఈయన తన భార్య, కుటుంబసభ్యుల పేర్లతో మహబూబ్ నగర్ జిల్లాలో 52 ఎకరాలు సొంతం చేసుకున్నట్లు రికార్డులతో సహా బయటపడింది.
అఖిల భారత సర్వీసు అధికారులంతా రెగ్యులర్ గా తమ ఆస్తులు, అప్పుల వివరాలను డీవోపీటీకి అందచేయాలి. కేంద్రహోంశాఖ పరిధిలోని డీవోపీటీ అఖిల భారత సర్వీసు అధికారుల వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటుంది. అలాంటిది డీవోపీటీకి చెప్పకుండానే వీళ్ళల్లో కొందరు వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సమకూర్చుకుంటున్నట్లు బయటపడుతోంది. వీళ్ళు కాకుండా ఇంకా చాలామంది ఐఏఎస్ ల బాగోతాలు బయటపడతాయంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.