టాలీవుడ్‌కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య సినిమా హాలు వద్ద జరిగిన ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనను ఆయన హత్యగా పేర్కొన్నారు. ఇది దురదృష్టకరం కాదని.. తాము హత్యగానే భావిస్తున్నట్టు చెప్పారు. ఇవన్నీ.. ప్రమీయర్ షోలకు.. అడ్వాన్సు షోలకు అనుమతి ఇవ్వడం వల్లే సంభవించాయని తెలిపారు.
అదేవిధంగా గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఇచ్చిన అనుమతులు.. కారణం.. ప్రభుత్వం కొనసాగించాల్సి వచ్చిందని తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి ఇక, నుంచి తాము కొత్త సినిమాల విడుదలపై కఠినంగా వ్యవహ రించనున్నట్టు చెప్పారు. “నేను సీఎం సీటులో ఉన్నంత వరకు.. ప్రీమియర్ షోలకు ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించను“ అని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. అంతేకాదు.. అడ్వాన్సు సినిమా షోలకు. ప్రీమియర్ షోలకు కూడా.. అనుమతి ఇచ్చేది లేదన్నారు.
దీనిని చాలా సీరియస్‌గానే తీసుకుంటున్నామని.. ప్రజలకు సంబంధించిన విషయమని ఆయన పేర్కొన్నారు. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను అమలు చేస్తే.. వచ్చే సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా వెంకటేష్, చిరంజీవి సినిమాలు సహా.. పలు సినిమాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రీమియర్ షోలపై నిషేధం, టికెట్ల ధరల పెంపుపై నిషేధం విధిస్తే.. టాలీవుడ్ అగ్ర హీరోలపైనా ప్రభావం చూపనుంది.
ఇప్పటి వరకు ఈ ప్రీమియర్ షోలు, టికెట్ల ధరల పెంపు విషయాలపై ఆధారపడే.. అగ్రహీరోలు అధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారన్న చర్చ నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనపై టాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా.. పుష్ప-2 ఎఫెక్ట్ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలవర పరిచిందనేది సీఎం మాటలను బట్టి అర్థమైంది.