ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరిన్ని చిక్కుల్లో కూరుకుపోయారు. ఇప్పటికే ఆయనపై ఢిల్లీ లిక్కర్ కేసు దాఖలైంది. ఈ కేసులో ఆయనే ప్రధాన నిందితుడని ఈడీ అధికారులు పేర్కొన్నారు. అరెస్టు చేసి.. జైలుకు కూడా తరలించారు. అయినప్పటికీ.. అక్కడ నుంచి తన పాలనను కేజ్రీవాల్ కొనసాగిస్తున్నారు. ఇది కూడా ఎన్నో రోజులు ఉండే అవకాశం లేదు. కీలకమైన ఎన్నికల సమయంలో ప్రచారానికి దూరంగా ఆయన జైల్లో ఉండడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు తర్జనభర్జనలో పడ్డారు. ఇదిలా కొనసాగుతుండగానే.. మరో బాంబు లాంటి వార్త బయటకు వచ్చింది.
ఖలిస్థానీ తీవ్ర వాదులతో కేజ్రీవాల్‌కు ఆర్థిక పరమైన సంబంధాలు ఉన్నాయనే విషయం వెలుగు చూసింది. పంజాబ్ వేర్పాటు వాద నేత, ఖలిస్థానీ మాస్టర్ మైండ్ గురుపత్వంత్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖలిస్థానీ గ్రూపుల నుంచి 2014 – 2022 మధ్యకాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 133.54 కోట్ల నిధులను స్వీకరించిందని తెలిపారు. తమకు ఆర్థికసాయం చేస్తే జైల్లో ఉన్న టెర్రరిస్ట్ దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారని చెప్పారు. 1993లో జరిగిన ఢిల్లీ బాంబు పేలుళ్లలో దేవీందర్ పాల్ ఉన్నారు. ఈ పేలుళ్లలో తొమ్మిది మంది చనిపోగా… మరో 31 మంది గాయపడ్డారు.
అలాంటి దేవీందర్ పాల్ సింగును కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు తెస్తానని చెప్పడంతో రూ.133.54 కోట్లను ఆయన ఖాతాలకు బదిలీ చేసినట్టు పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఈ కేసు కూడా కేజ్రీవాల్ మెడకు మరో గుదిబండగా మారనుందని అంటున్నారు పరిశీలకులు. ఖలిస్థానీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా గరుపత్వంత్ సింగ్ చేసిన ఆరోపణలు నిజమా? అనేది తేలాల్సి ఉంది. కానీ, ఇప్పటికే కేసుల్లో ఉన్న కేజ్రీవాల్ ఇది నిజం కాదని తనే నిరూపించుకోవాల్సి కూడా ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
2014లో న్యూయార్క్ లోని రిచ్ మండ్ హిల్ లో కేజ్రీవాల్, ఖలిస్థానీ అనుకూలవాదుల మీటింగ్ జరిగిందని గురుపత్వంత్ తెలిపారు. ఆర్థికసాయం చేస్తే… దీనికి బదులుగా దేవీందర్ పాల్ సింగ్ ను విడిపిస్తానని కేజ్రీవాల్ ప్రామిస్ చేశారని చెప్పారు. కేజ్రీవాల్ పై గురుపత్వంత్ ఆరోపణలు చేయడం ఇదే తొలిసారి కాదు. జనవరిలో ఆయన మాట్లాడుతూ… అమెరికా, కెనడాలో ఉన్న ఖలిస్థానీ మద్దతుదారుల నుంచి కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ 6 మిలియన్ డాలర్ల విరాళాలను అందుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టయి జైల్లో ఉన్న నేపథ్యంలో తాజా ఆరోపణలు ఆయనను మరింత ఉక్కిరిబిక్కిరికి గురి చేయనున్నాయని అంటున్నారు పరిశీలకులు.