ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఇంకా సెకండ్ వేవ్ తీవ్రత పూర్తిగా తగ్గక ముందే థర్డ్ వేవ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై థర్డ్ వేవ్ పెను ప్రభావం చూపనుందని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా థర్డ్ వేవ్ స్టార్ట్ అయిందని, 7 వేల మంది చిన్నారులకు కరోనా సోకిందని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఏపీలో మాత్రం కరోనా తీవ్రత తగ్గిన తర్వాత టెన్త్ , ఇంటర్ పరీక్షలు నిర్వహించాల్సిందేనంటూ జగన్ మొండిపట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ నిప్పులు చెరిగారు. పరీక్షలపై సమీక్షించేందుకు పీఎంకు కూడా ఖాళీ దొరికిందని, కానీ, ఏపీ సీఎంకి ఖాళీ లేదని లోకేష్ ఎద్దేవా చేశారు.
పరీక్షల రద్దు విషయంలో ప్రభుత్వ వ్యవహార శైలిపై తాడేపల్లి శకునిమామ స్పందించాలని లోకేష్ డిమాండ్ చేశారు. లక్షలాది మంది పిల్లల ప్రాణాల రక్షణకు సీఎం, మంత్రులు పూచీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, టీచర్ల ప్రాణాల రక్షణ కోసం న్యాయపోరాటం కొనసాగిస్తానని లోకేష్ స్పష్టం చేశారు.