కూటమి సర్కారు ఏర్పడింది.. అంటే.. ఇది ఒకరోజు చేసిన ప్రయత్నం కాదు. ఒక నెల చేసినప్రయత్నం కాదు. సుమారు మూడు సంవత్సరాల పాటు అనేక ఎదురు దెబ్బలకు ఓర్చుకుని, జైలు పాలైనా మొక్కవో ని దీక్షతో ముందుకు నడిచిన చంద్ర బాబు పనితీరు, కష్టం వల్లే.. నేడు సర్కారు ఏర్పడింది. ఇంత మంది ఎమ్మెల్యేలు గెలుపు గుర్రం ఎక్కారు. అలాంటి సర్కారును పదిలంగా కాపాడుకోవాల్సిన అవసరం, బాధ్య త అందరిపైనా ఉంటుంది.
అయితే.. ఈ విషయాన్ని మరిచిపోతున్న కొందరు ఎమ్మెల్యేలు.. ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ.. సర్కారు కు ఎంత వేగంగా చెడ్డపేరు తెద్దామా? అనే తొందరతో పరుగులు పెడుతున్నారు. నిన్న మొన్నటి వరకు గ్రూపు రాజకీయాలు.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి. తమ్ముళ్ల మధ్య వివాదాలు, విమర్శలతోనే గత నాలుగు మాసాలు గడిచిపోయాయి. ఇప్పుడిప్పుడే సర్దుబాటు చేసుకుంటున్న సమయంలో అనూహ్యంగా అరవింద్ రూపంలో మరో వివాదం తెరమీదికి వచ్చింది.
గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యేగా తొలిసారి విజయం దక్కించుకున్న చదలవాడ అరవింద్ బాబు.. వివాదంలో చిక్కుకున్నారు. ఆయన వ్యవహరించిన తీరు సర్కారుపై తీవ్ర విమర్శలు వచ్చేలా చేసింది. ఫక్తు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎవరూ ఇలా చేయడం లేదని.. సీఎం చంద్రబాబు అన్నారంటే.. ఆయన చేసిన యాగీ అంతా ఇంతా కాదు. తాను చెప్పిన వారికే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వాలంటూ.. రభస సృష్టించారు.
కానీ.. ఈయనకు అసలు గత ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన చంద్రబాబును గుర్తుంచుకుంటే.. ఇలాంటి పనులు చేయరన్న వాదన సొంత పార్టీలోనే వినిపిస్తోంది. ఎమ్మెల్యేలు సొంతంగా తమ తమ డిమాండ్లు నెరవేర్చుకోవచ్చు. కానీ, అది కూడా సైలెంట్‌గా మరో వారికి తెలియకుండా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ, గతంలో తిరువూరు ఎమ్మెల్యే శ్రీనివాసరావు, ఇప్పుడు అరవిందబాబు సర్కారును రోడ్డున పడేలా వ్యవహరిస్తున్న తీరు సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తుండడం గమనార్హం.