సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన కారణంతో వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం నేపథ్యంలో కూటమి పార్టీల నేతలకు, వైసీపీ నేతలకు మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీలో కూటమి పార్టీల నేతలకు సోషల్ మీడియా పోస్టుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సున్నితమైన హెచ్చరిక జారీ చేశారు.
సోషల్ మీడియా పోస్టుల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని అసెంబ్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీల కార్యకర్తలకు చంద్రబాబు హెచ్చరిక జారీ చేశారు. వైసీపీ తరఫున సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రత్యర్థి పార్టీల కుటుంబ సభ్యులను, మహిళలను కించపరిచేలా, వారు నొచ్చుకునేలా ఎవరూ కామెంట్లు చేయడానికి వీలులేదని సొంత పార్టీ నేతలకు కూడా చంద్రబాబు తేల్చి చెప్పారు.
మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే ఏ పార్టీ అయినా ఒకటేనని, పారదర్శకంగా ఉంటానని చంద్రబాబు క్లారిటీనిచ్చారు. ఒకవేళ ఇటువంటి పనులు కూటమి పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు చేసినా ఉపేక్షించబోనని వార్నింగ్ ఇచ్చారు. అందరూ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని, మహిళలను కించపరిచేలా వ్యవహరిస్తే సహించబోనని చంద్రబాబు సీరియస్ గా చెప్పారు. ప్రత్యర్థి పార్టీల నేతల కుటుంబ సభ్యులపై, మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే వైసీపీ నేతలు ఎంజాయ్ చేశారని, ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి పార్టీల నేతలు కూడా అలా వ్యవహరిస్తారనుకోవద్దని చంద్రబాబు అన్నారు.