పెట్టుబడులు, సీఎం చంద్రబాబు కు అవినాభావ సంబంధం ఉంది అంటే అతిశయోక్తి కాదు. మిగతా ముఖ్యమంత్రులకు ఆ ప్రాంతంలో రాళ్లు, గుట్టలు కనిపిస్తే…చంద్రబాబుకు మాత్రం హైటెక్ సిటీ కనిపించింది. 1998లో హై టెక్ సిటీకి అంకురార్పణ చేసి పెట్టుబడులు ఆహ్వానించిన అదే చంద్రబాబు…ఇప్పుడు వైసీపీ పాలన వల్ల గాడి తప్పి గాడాంధకారంలో ఉన్న నవ్యాంధ్ర ప్రదేశ్ కు పెట్టుబడుల వెలుగులు నింపేందుకు నడుం బిగించారు. ఏపీలో విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు దావోస్ లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా జ్యూరిచ్ ఎయిర్ పోర్టులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఎంపీ రామ్మోహన్ నాయుడులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి. జ్యురిచ్ లో చలికి తట్టుకోలేక యువ నేతలంతా స్వెట్టర్లు ధరించారు. కానీ, ఏడు పదులు వయసులో ఉన్న చంద్రబాబు మాత్రం…ఎముకలు కొరికే చలిలో కూడా స్వెట్టర్ వేసుకోకుండా ఎప్పటి లాగే తన ఫార్మల్ డ్రెస్ లో ఉన్నారు. దీంతో, చలినే వణికించిన చంద్రబాబు..అంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటో వైరల్ గా మారింది. దాంతోపాటు, శ్రీధర్ బాబు భుజంపై చేయి వేసి ఆప్యాయంగా చంద్రబాబు పలకరిస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జ్యూరిచ్ విమానాశ్రయంలో సీఎం చంద్రబాబు, లోకేశ్, రామ్మోహన్ నాయుడు, ఇతర నేతల బృందానికి యూరప్ టీడీపీ ఫోరం సభ్యులు, ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలోనే విమానాశ్రయంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుల బృందంతో చంద్రబాబు బృందం భేటీ అయింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వస్తున్న పెట్టుబడులపై రేవంత్, చంద్రబాబు చర్చించుకున్నారు.