గాంధీ జయంతిని సందర్భంగా ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా చెత్త పన్ను రద్దు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇకపై రాష్ట్ర ప్రజలు చెత్త పన్ను కట్టక్కర్లేదని పేర్కొన్నారు. నేడు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. గాంధీ జయంతి సందర్భంగా అక్కడ నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగుతూ కాసేపు వారితో ముచ్చటించిన బాబు.. ఆపై నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. చెత్త మీద పన్నును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. వచ్చే క్యాబినెట్లో ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తామన్నారు. ప్రజల నుంచి చెత్త పన్ను వసూలు చేయరాదని అధికారులకు కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు.
అలాగే గాంధీ చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా బాబు గుర్తు చేశారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం నేర్పించారని, బానిసత్వం వద్దు స్వాతంత్ర్యమే ముద్దు అని నినదించారని సీఎం పేర్కొన్నారు. అలాగే బాపూజీ స్ఫూర్తితో 2014 అక్టోబర్ 2న ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం తీసుకురావడం జరిగిందని.. ఇదొక గొప్ప కార్యక్రమని అన్నారు. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే.. మనం ఆరోగ్యంగా ఉంటామన్నారు.
నీతి ఆయోగ్‌లో స్వచ్ఛ భారత్‌పై సబ్ కమిటీ ఏర్పాటు చేయగా.. దానికి తాను ఛైర్మన్‌గా ఉన్నానని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఏపీని ఓడీఎఫ్ రాష్ట్రంగా మార్చామన్నారు. గ్రామ పంచాయతీల్లో తాము సాలిడ్ వేస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయిస్తే.. వైసీపీ నేతలు ఆ షెడ్లకు సొంతానికి వాడుకున్నారని సీఎం ఆరోపించారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను అస్తవ్యస్తం చేసిందని.. రోడ్లపై 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయిందని బాబు వివరించారు. ఆ వేస్ట్ ను ఏడాది లోపు క్లీన్ చేయించాలని మంత్రి నారాయణను ఆదేశించామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని.. 2029 కి ఏపీ స్వచ్చ ఆంధ్రప్రదేశ్‌గా మారాలని పిలుపునిచ్చారు.