ఉన్నత స్థాయిలో ఉండే రాజకీయ నాయకులు చాలా వరకు సీరియస్‌గానే కనిపిస్తుంటారు. అందులోనూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థానాల్లో ఉన్న వాళ్లంటే ఇంకా సీరియస్‌గా ఉంటారు. అలాంటి వ్యక్తులు పగలబడి నవ్వే దృశ్యాలు అరుదుగానే అనిపిస్తాయి. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలా అరుదైన స్పందనలతో తమ అభిమానులను ఆనందంలో ముంచెత్తారు.
ఏపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గత కొన్ని రోజులుగా ఆటల పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వీటి ముగింపు సందర్భంగా ప్రజా ప్రతినిధుల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎప్పుడూ సీరియస్‌గా ఉండే నేతలకు ఆహ్లాదం పంచింది. ఈ వేడుకల్లో భాగంగా ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు దుర్యోధనుడి వేషం వేసి సీనియర్ ఎన్టీఆర్ డైలాగులు చెప్పడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
అలాగే మంత్రి కందుల దుర్గేష్ బాలచంద్రుడి అవతారంలో అదరగొట్టారు. ఇంకా పలువురు ప్రజా ప్రతినిధులు వివిధ వేషాల్లో దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాలను బాబు, పవన్ భలేగా ఆస్వాదిస్తూ కనిపించారు. రఘురామ, దుర్గేష్ స్టేజ్ మీదికి వచ్చినపుడు ఇద్దరూ నవ్వుతూ దర్శనమిచ్చారు. ఇక ఒక నాటకంలో భాగంగా స్టేజ్ ఆర్టిస్టులు రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అంటూ పాట పాడినపుడు బాబు, పవన్ పగలబడి నవ్వడం.. బాబు చేతిని నోటికి అడ్డు పెట్టుకుని మరీ నవ్వడం.. పవన్ ఎగిరెగిరి పడుతూ ఒకప్పటి ఆడియో వేడుకల దృశ్యాలను గుర్తు చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాబు, పవన్ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ సంతోషంగా కనిపించాలంటూ వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. శాసనసభ్యులకు ఆట విడుపుగా తరచుగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.