సాత్వికుడైతే కావొచ్చు..ఎన్నికల్లో ఓటమి పాలు కావొచ్చు. రాజకీయాలు తన ఒంటికి సరిపోవన్న నిర్ణయానికి వచ్చేసి.. కష్టపడి పెట్టిన పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి.. తెలుగు వారికి తీవ్రమన నిరాశను కలిగించారు ప్రముఖు నటుడు మెగాస్టార్ చిరంజీవి.
అలాంటిది తన రోటీన్ తీరుకు భిన్నంగా వ్యవహరించిన ఆయన హాట్ టాపిక్ గా మారారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు నష్టాల బూచీ చూపించి.. ప్రైవేటుకు కట్టబెట్టాలనుకున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి సెకండ్ ఫేజ్ దెబ్బకు యావత్ దేశం ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి.
దేశంలో నెలకొన్న ఆక్సిజన్ నిల్వలకు అంతో ఇంతో సాయం చేస్తున్న సంస్థల్లో.. కేంద్రం ఇటీవల అమ్మకానికి పెట్టిన విశాఖ ఉక్కు ఈ రోజున అండగా నిలిచింది. దేశీయంగా అవసరమైన మెడికల్ ఆక్సిజన్ అవసరాల్ని ఈ సంస్థ తీరుస్తోంది.
ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కును అమ్మేసి ఉంటే.. ఈ రోజున దేశానికి అవసరమైన ఆక్సిజన్ ను ఎలా సరఫరా చేసే వారు అన్న ప్రశ్న పలువురి మదిలో మెదులుతోంది.
అయినప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏ ప్రముఖుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి.. మోడీని ప్రశ్నించిన దాఖలాలు లేవు. అందుకు భిన్నంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి మాత్రంసోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రధాని మోడీకి పంచ్ వేశారు.
ఇంతకీ ఆ పంచ్‌లో ఏముందన్న విసయానికి వస్తే.. ‘దేశమంతా ఆక్సిజన్ దొరక్క కరోనా పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఈ రోజు ఒక ప్రత్యేక రైలు విశాఖ ఉక్కు కర్మాగారానికి చేరింది.
అక్కడ నుంచి 150 టన్నుల ఆక్సిజన్ టన్నులను మహారాష్ట్ర కు తీసుకెళుతున్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం రోజుకు 100 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తోంది.
ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో ఎన్నో రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించి లక్షలాది మంది ప్రాణాల్ని నిలబెడుతుంది. అలాంటి విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో ఉందని ప్రైవేటు పరం చేయటం ఎంతవరకు సమంజసం?’ అంటూ సూటిగా ప్రశ్నించారు.
ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్నట్లుగా.. ప్రధాని మోడీకి సరైన సమయంలో సరైన పంచ్ వేసిన చిరును అభినందించకుండా ఉండలేం. అదే సమయంలో.. టైం కు తగ్గట్లు దెబ్బ వేసే కొత్త టాలెంట్ ఎప్పుటి నుంచి మొదలైంది చిరు?
Let us THINK.. #VizagSteelPlant #OxygenForIndia pic.twitter.com/6MjSKp7jVB
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 22, 2021