ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే గడువున్న నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా పరుచూరు నియోజకవర్గం ఇంకొల్లులో నిర్వహించిన రా కదలిరా సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన సభను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైనంపై చంద్రబాబు మండిపడ్డారు. తన రాజకీయ అనుభవంతో పోలిస్తే జగన్ ఒక బచ్చా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సారి పులివెందులలో కూడా టిడిపి గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
కాస్కో జగన్మోహన్ రెడ్డి అంటూ చంద్రబాబు సవాల్ విసిరారు. టిడిపి మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అంటూ విరుచుకుపడ్డారు. ఈ మీటింగ్ చూసి జగన్ రెడ్డి ప్యాంటు తడిసిపోయింది అంటూ చురకలంటించారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన కూటమి సునామీ సృష్టిస్తుందని చెప్పారు. గెలుపు మనదే తమ్ముళ్లు ఎవరికైనా అనుమానం ఉందా అంటూ కార్యకర్తల్లో జోష్ నింపారు. అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్ళడమే తప్ప ఆగే ప్రసక్తే లేదని కార్యకర్తలలో ఉత్సాహం నింపారు. జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు సిద్ధమని, వైసిపిని భూస్థాపితం చేసేందుకు మీరు సిద్ధమని ప్రజలనుద్దేశించి చంద్రబాబు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ఆవేశపూరితంగా ప్రసంగించడం చర్చనీయాంశమైంది.