టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అక్రమంగా అరెస్టు చేశారని, ఆ ఎఫ్ ఐ ఆర్ ను క్వాష్ చేయాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. దాంతోపాటు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ కూడా ఈ నెల 19వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. ఇక, చంద్రబాబును 5 రోజులపాటు కస్టడీకి కోరుతూ సిఐడి అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణ జరగాల్సి ఉంది.
అయితే, ఈ నెల 18 వరకు చంద్రబాబుకు కస్టడీలోకి తీసుకోవద్దని సిఐడి అధికారులతో పాటు విజయవాడలోని ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ తో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సిఐడి అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టులో చంద్రబాబు తరఫున న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని…సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల మధ్య వాడీవేడీ వాదోపవాదాలు జరిగాయి.
17 ఏ సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే చంద్రబాబును అరెస్టు చేయాలని, దానిపై వాదనలు వినాలని హైకోర్టు న్యాయమూర్తికి లూథ్రా విజ్ఞప్తి చేశారు. అయితే సిఐడి కౌంటర్ దాఖలు చేయకుండానే ఇప్పటికిప్పుడే వాదన వినాలని పట్టుబట్టడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. తాను గతంలో పీపీగా పని చేశానని, ఏవైనా అభ్యంతరాలుంటే ఈ పిటిషన్లను వేరే బెంచ్ కు బదిలీ చేస్తామని న్యాయమూర్తి అన్నారు. అయితే, అభ్యంతరాలు ఏమీ లేవని చెప్పడంతో ఈ కేసు విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. దీంతో, మగంళవారంనాడు హైకోర్టులో జరగబోయే విచారణపై ఉత్కంఠ ఏర్పడింది.