స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ సోమవారం నాడు సుప్రీంలో విచారణకు వచ్చే అవకాశముంది. ఈ నెల 2వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీం కోర్ట్‌కు సెలవుల నేపథ్యంలో మంగళవారం నాడు విచారణ జరిగే చాన్స్ ఉంది. మరోవైపు, విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇక, చంద్రబాబును మళ్లీ కస్టడీకి ఇవ్వాలని కోర్టులో సీఐడీ అధికారులు మెమో దాఖలు చేశారు.
అయితే, కస్టడీ పొడిగింపుపై తమ వాదనలు కూడా వినాలని కోర్టును చంద్రబాబు తరఫు న్యాయవాది పోసాని కోరారు. ఈ రెండు అంశాలపై ఈరోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్, ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో పీటీ వారెంట్ లపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టును సీఐడీ కోరింది. ఇక, చంద్రబాబుకు రిమాండ్ ను విజయవాడ ఏసీబీ కోర్టు అక్టోబర్ 5వ తేదీ వరకు పొడిగించింది. రిమాండ్ పొడిగింపుపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినా…ఇవి సాధారణమని 11 రోజుల పాటు రిమాండ్ పొడిగించారు.
2 రోజుల కస్టడీ అనంతరం చంద్రబాబును కోర్టులో హాజరుపరిచారు. జైలు నుంచి వర్చువల్ గా కోర్టుకు చంద్రబాబు హాజరయ్యారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించారా అని చంద్రబాబును న్యాయమూర్తి అడిగారు. అయితే, విచారణ వివరాలను బయటపెట్టాలని చంద్రబాబు అడిగారు. ఇపుడు ఆ వివరాలను బయట పెట్టడం సరికాదని న్యాయమూర్తి అన్నారు. చంద్రబాబును సీఐడీ అధికారులు రెండు రోజుల సీఐడీ కస్టడీలో దాదాపు 12 గంటలపాటు మొత్తం 30 అంశాలపై 120 వరకు ప్రశ్నలు సంధించారని తెలుస్తోంది.