నెల్లూరులో ఈ రోజు నిర్వహించిన ‘రా కదలిరా’ బహిరంగ సభలో గల్లా జయదేవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సామాన్యులు మొదలు ఎంపీ గల్లా జయదేవ్ వరకు అంతా జగన్ బాధితులేనని, ఒక రాజకీయ కుటుంబం రాజకీయాలే వద్దని విరమించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. అమరరాజా కంపెనీని తెలంగాణకు వెళ్లిపోయేలా చేశారని, ఇపుడు జయదేవ్ ను రాజకీయాల నుంచి వెళ్లేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ పాలనలో ప్రజల జీవితాలలో మార్పు రాలేదని, రైతుల ఆత్మహత్యల్లో ఏపీ నంబర్ వన్ అని అన్నారు. నిరుద్యోగంలోనూ మిగతా రాష్ట్రాలను ఏపీ వెనక్కు నెట్టిందని, 24 శాతంతో అగ్రస్థానంలో ఉందని అన్నారు. కానీ, దేశంలోని ధనిక సీఎంలలో జగన్ ముందున్నారని ఎద్దేవా చేశారు. జగన్ అభిమన్యుడు కాదని, భస్మాసురుడని సెటైర్లు వేశారు. భస్మాసుర వధ చేసే బాధ్యత 5 కోట్ల ప్రజలదని చెప్పారు. నీ ఫ్యాను మూడు రెక్కలను ప్రజలు ప్రజలు మూడు ముక్కలు చేయబోతున్నారని, ఆ తర్వాత మిగిలే మొండి ఫ్యానును నీ రివర్స్ పాలనకు రిటర్న్ గిఫ్ట్ గా ఇస్తారని చురకలంటించారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి తప్పదని, తాడేపల్లి ప్యాలెస్ లో తీరిగ్గా కూర్చుని బాధపడే రోజు కోసం ‘సిద్ధం’గా ఉండు జగన్ రెడ్డీ అని చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో నష్టపోయిన ప్రతీ ఒక్కరూ టీడీపీ స్టార్ క్యాంపెయినర్లేనని చంద్రబాబు చెప్పారు. 5 కోట్ల ఆంధ్రులను స్టార్ క్యాంపెయినర్లుగా మార్చి వైసీపీని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చారు.
అధికార పార్టీ నేతలు ప్రతీ పనిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని, కూల్చుడు, నూకుడు, బుక్కుడు, దంచుడు, దోచుడు ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయడానికి మీరు సిద్ధమేనా అంటూ సభకు హాజరైన ప్రజలను ప్రశ్నించారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేసి మన బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.