ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మునుపెన్నడూ లేని విధంగా పదునైన విమర్శలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ పై బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ వంటి విచిత్రమైన సీఎంను ఇంతవరకు చూడలేదని, జగన్ హయాంలో బాపట్ల వంటి ప్రాంతాల్లో కూడా గంజాయి దొరుకుతోందని ఆరోపించారు. నా బీసీలు అంటూనే 30 రకాల పథకాలు, నా ఎస్సీలు అంటూ 27 పథకాలు రద్దు చేశాడని చురకలంంటించారు.
నా ఎస్సీలు అని చెప్పే ముఖ్యమంత్రి, ఓ ఎస్సీని చంపి డోర్ డెలివరీ చేస్తే ఏం చేశాడని చంద్రబాబు ప్రశ్నించారు. అంబేడ్కర్ పేరుతో తాను పెట్టిన విదేశీ విద్యా పథకానికి తన పేరు పెట్టుకున్న ఘనత జగన్ ది అని ఎద్దేవా చేశారు. జగన్ అహంకారం విధ్వంసంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేశాడని, జగన్ విధ్వంసం ఖరీదు నాలుగు లక్షల కోట్లని ఆరోపించారు. పవన్ ప్రభుత్వ ఓటు చీలనివ్వనని చెప్పారని, బీజేపీ, టీడీపీ,జనసేన పొత్తుతో జగన్కు నిద్రపట్టడం లేదన్నారు. కులాలకతీతంగా తెలుగు వారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏకం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజల ఆస్తి జగన్ లూటీ చేశాడని, సంపదను నాశనం చేసి ప్రజల నెత్తిన 13 లక్షల కోట్ల అప్పులు పెట్టాడని ఆరోపించారు. పన్నుల రూపంలో ప్రజలే కట్టాలని, అదే తన బాధ అని అన్నారు. రివర్స్ టెండరింగ్ అంటూ గోదావరిలో పోలవరాన్ని ముంచేశాడన్నారు.