జగన్‌ను తిట్టే నైతిక అర్హత పవన్‌కు ఎక్కడిది?
నలుగురు కలిసి ఒక్కరిని చుట్టుముడితే ఎలా ఉంటుంది?
2019 ఎన్నికల్లో సరిగ్గా ఇదే జరిగింది!
BJP, KCR, జగన్, పవన్ కలిసి TDPని చుట్టుముట్టి రాజకీయం చేశాయి.
దీనివల్ల ఎవరు లబ్ధి పొందారు?
మోదీ – అమిత్ షా లాభపడ్డారు. వీరి కుడి, ఎడమ భుజాలైన అదానీ, అంబానీలకు ఆంధ్ర ప్రదేశ్ అడ్డాగా మారింది. వారికి జగన్ పాదాక్రాంతం అయ్యాడు.
చంద్రబాబుతో అది కుదరదు కదా! అందుకే APకి అన్యాయం చేయడంలో మోషాలు ముమ్మాటికీ దోషులే!
ఇక KCR కూడా అమరావతిని నిర్వీర్యం చేయడం ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌ను పెంచుకుని వేల కోట్ల ఆదాయం అదనంగా వచ్చేలా చేసుకున్నాడు.
రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన వందిమాగధులు కబ్జా చేసిన వేల ఎకరాల భూముల్లో వెంచర్లు వేసి లక్షల కోట్ల ప్రజా ధనాన్ని అధికారికంగా దోచుకునేందుకు అవకాశం ఇచ్చాడు.
వాళ్ల దగ్గర నుంచి కావాల్సినంత పిండుకున్నాడు. ప్రతిపక్షాలు తనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, దేశ వ్యాప్తంగా ఎన్నికల ఖర్చు భరిస్తా అని KCR అన్నాడంటే ఎంత డబ్బు మూట కట్టుకున్నాడో అంచనా వేసుకోవచ్చు.
ఇక జగన్ దోపిడీ గురించి చెప్పాలంటే మాటలు చాలవు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఇచ్చింది పది రూపాయలు అయితే దోచింది వంద రూపాయలు.
విశాఖలో కొండకు గుండు కొట్టడం కాదు… అది AP ప్రజలందరికీ జగన్ కొట్టిన సామూహిక గుండు!
2019 కుట్రలో పాలు పంచుకున్న పవన్ కల్యాణ్‌ను చూస్తే ఈ ప్రపంచంలో నేనొక్కడినే మంచోడిని.
అభ్యుదయ భావాలు నాకు మాత్రమే ఉన్నాయన్నట్లు చెప్పుకుంటూ ఉంటాడు.
లేస్తే మనిషిని కాదంటాడు.
అప్పుడెప్పుడో KCR కూతురు కవిత, జాగృతి సంస్థ పేరిట చేసిన అన్యాయాలను ప్రశ్నిస్తా అన్నాడు.
ఎప్పుడు ప్రశ్నిస్తాడా అని పదేళ్లుగా ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు.
గత ఎన్నికల్లో పవన్ చేత YCP, BJP ఆడించిన రాజకీయం ఏమిటి? ఆయనకు ఇచ్చిన టాస్క్ ఏమిటి?
చంద్రబాబు ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయాలి. అప్పటి వరకు చంద్రబాబు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న BJP అవినీతి ఆరోణలు చేస్తే ఎవరూ నమ్మరు.
ఇక అవినీతి శిఖరం జగన్ మాటలు అసలు నమ్మరు. కాబట్టి ఇందుకోసం పవన్ కల్యాణ్‌ను రంగం లోకి దించి అవినీతి ఆరోపణలు చేయించారు.
ఇవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ఈ విధంగా తప్పుడు ఆరోపణలను పవన్ చేత చేయించారు.
BJP, YCP ఎత్తుగడలో పవన్ ఒక పావు అయ్యాడు.
నాలుగేళ్లు గడిచాయి.
చంద్రబాబు, లోకేశ్‌లపై చేసిన ఆరోపణలను పవన్ BJP అండతో తేల్చాలి కదా.. ఒక రాజకీయ నాయకుడిగా ఏం చేశావో ప్రజలకు చెప్పు మిస్టర్ పవన్ కల్యాణ్.
తప్పు చేశానని ఈ నాలుగేళ్లలో ఎప్పుడూ నీకు అనిపించలేదా పవన్.
అనిపించి ఉండాలి.
లేదంటే నువ్వు మనిషివే కాదు…
అప్పుడు జగన్‌ను నమ్మినోళ్లకు.. రాజకీయంగా జగన్ కొత్తోడు, మంచోడు అని వాళ్ల మెదళ్లలోకి విషాన్ని ఎక్కించారు.
ఇప్పుడు జగన్ స్థానంలో నేనున్నా అని పవన్ మొదలుపెట్టాడు.
నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాడు. అది కూడా పదేళ్లు కావాలట. నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు!
పది వేల కోట్లు వున్నా పార్టీని నడపలేం అంటావు. పార్టీని నడపడానికి సినిమాలు చేస్తున్నా అంటావు.
ప్రజలకు ఏం చేస్తావు? నీ విజన్ ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు లేవు.
ఎంతసేపు వ్యక్తిగత ద్వేషాలు, కోపాలు, సవాళ్లు… మాకెందుకు ఇవన్నీ!
ప్రజారాజ్యం వల్ల తెలుగు ప్రజలకు ఎంత అన్యాయం జరిగిందో, అంతకు మించిన అన్యాయం జనసేన వల్ల జరుగుతోంది.
YCPని గెలిపించడం కోసమే జనసేన ఉపయోగపడుతోంది.
భీష్ముడిని చంపడానికి శిఖండి ఎలా ఉపయోగ పడ్డాడో ఈ BJP, YCP కోసం ఆడించే ఈ ఎన్నికల భారతంలో పవన్ పాత్ర అంత వరకే!
రాబోయే ఎన్నికల్లో ఆంధ్రులు ఒకటి గ్రహించాలి.
ఓటు వేయకుండా ఇంటిలో కూర్చున్నా, వెళ్లి నోటాకు ఓటు వేసినా, జనసేనకు ఓటు వేసినా, అది YCPకి వేసినట్లే! ఈసారి ఎలక్షన్ ఇంజనీరింగ్ అలా సెట్ చేస్తోంది BJP.
అందుకే… ఏపీ ప్రజలు కుత్సిత రాజకీయాలను అర్థం చేసుకుని, కలిసికట్టుగా, TDPని కసిగా, బలమైన సంకల్పంతో గెలిపించుకోవాలి.
లేదంటే తమ పీక తామే కోసుకున్న వారు అవుతారు.
TDPతో జనసేన పొత్తు సంగతి చూద్దాం.
ఈ పొత్తు మాటలన్నీ తెలంగాణలో ఎన్నికలు జరిగేటంత వరకే.
చంద్రబాబు పట్ల BJP సానుకూలత అక్కడ పబ్బం గడుపుకునే వరకే.
ఆ తర్వాత ఉంటుంది సీట్ల కోసం వ్యూహాలు.
TDP గెలిచే సీట్లు జనసేన, BJP అడుగుతాయి. TDPని గెలవనీయరు… వీళ్లు గెలవరు.
2009 ఎన్నికల్లో మహా కూటమిలో ఉన్న KCR కూడా TDP గెలిచే సీట్లు ఎక్కువ సంఖ్యలో తీసుకున్నాడు.
తను గెలవలేదు. TDPని గెలవనివ్వలేదు.
గత ఎన్నికల్లో దూరం నుండి TDPపై పవన్ చేత BJP రాళ్లు వేయించింది.
ఈసారి దగ్గరకు పంపి చికాకు పెట్టి దెబ్బ తీస్తుంది. పవన్ ప్రస్తుతం వారాహి మీదకు ఎక్కి మాట్లాడుతున్న తీరు ఇందుకు నిదర్శనం.
చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ అని అదే పనిగా YCP ప్రచారం చేస్తూ ఆంధ్రుల దృష్టి మరలుస్తోంది.
దత్తపుత్రుడు అనే మాట పచ్చి అబద్ధం అయినా ఆంధ్రులు కదా… అబద్ధాలను ఎంతో ఇష్టంగా నమ్ముతారు.
కఠోరమైన సత్యం ఏమిటంటే మోడీ దత్త పుత్రుడు జగన్. స్వయంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామనే అనంతపురానికి వచ్చి మరీ చెప్పారు.. మోదీ జగన్‌ను.. సొంత కొడుకులా చూసుకుంటున్నాడు అని.
గత నాలుగేళ్లుగా జగన్ అరాచకాలను BJP ఎంతగా వెనకేసుకొస్తోందన్నది చూస్తూనే ఉన్నాము.
ఈ సంగతి తెలియని జీవి పవన్ కల్యాణ్ మాత్రమే!
మిస్టర్ పవన్, నీకు ఈ రోజు జనంలోకి వెళ్లి జగన్‌ను ప్రశ్నించే నైతిక అర్హత లేదు.
ఎందుకంటే జగన్ గెలుపుకు నువ్వే ముఖ్య కారణం కాబట్టి. నువ్వు అడగాల్సింది BJPని. మోదీ, అమిత్ షా, నిర్మలా సీతారామన్‌లను. దమ్ము దమ్ము అంటావుగా… చూపించు ఆ దమ్మేంటో మేమూ చూస్తాం!
కులాల గురించి మాట్లాడను అంటూనే కాపును అంటావు.
TDP, కాపులకు చేసిన మంచిని జగన్ ఒక్కొకటిగా తీసేస్తూ శఠగోపం పెడుతుంటే ఏం చేశావయ్యా ఇన్నేళ్లు?
ఏమిటి నువ్వు ప్రశ్నించేది?
నిన్ను అని ఏం లాభం? BJP ఆడించినట్లు ఆడాలి. మోదీ, షాలు చెప్పినట్లు నటించాలి. అదే నీ కథ
B – BRS
J – JAGAN
P – PAVAN
ఇదే అసలు కథ – BJPకి కొత్త నిర్వచనం