ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి మరింత రాజుకుంది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ఏకంగా క్రిమినల్ కేసు పెట్టారు. గుంటూరు జిల్లా ఎక్సైజ్ కోర్టులో ఈ మేరకు ఆయన కేసు దాఖలు చేశారు. తన తరఫున సీనియర్ న్యాయవాది కోటేశ్వరరావుతో ఈ కేసుకు సంబంధించిన పిటిషన్ను దాఖలు చేయించారు. దీనిలో మంత్రి పెద్దిరెడ్డి నుంచి రూ.50 కోట్లు నష్టపరిహారం ఇప్పించడంతోపాటు.. ఆయనతో బహిరంగ క్షమాపణలు చెప్పించాలని కూడా కోర్టును కోరారు. దీంతో ఈ విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.
ఏం జరిగింది?
రాష్ట్రం వైసీపీ సర్కార్ హయాంలో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని.. అయినవారికి కాంట్రాక్టులు కట్టబెడుతూ కోట్ల సొమ్ము ను దోచుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విమర్శలను ఖండిస్తూ సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇందులో మాజీ సీఎం చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీటిని సీఎం జగన్కు చెందిన మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు.
దీనిని ఆక్షేపిస్తూ.. నారా లోకేష్ ఈ ఏడాది సెప్టెంబరు 3న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లీగల్ నోటీసులు జారీ చేశారు. మంత్రి చేసిన ఆరోపణల కారణంగా తన కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లిందంటూ పరువునష్టం నోటీసులు పంపారు. ప్రజాబాహుళ్యంలో తన కీర్తి ప్రతిష్టలకు భంగం కలగజేయాలనే దురుద్దేశంతోనే మంత్రి పెద్దిరెడ్డి చేసిన నిరాధారమైన ఆరోపణలకు మనస్తాపం చెంది ఈ నోటీసులు పంపుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ నిరాధార నిందారోపణలకు నష్ట పరిహారం కింద రూ.50 కోట్లు చెల్లించాలని, బహిరంగ క్షమాపణలు చెప్పాలని, ఈ విషయాన్ని అదే పత్రిక, టీవీలో ప్రసారం చేయాలని కోరారు. అలా చేయని పక్షంలో సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ తరపున సీనియర్ న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
అయితే నోటీసులను తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దీనిపై స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మాజీ మంత్రి నారా లోకేష్ గుంటూరు ఎక్సైజ్ కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఎన్నికలకు ముందు మంత్రిపై క్రమినల్ కేసు నమోదు కావడంతో ఎలాంటి ఆదేశాలు వస్తాయోననే ఉత్కంఠ నెలకొంది.