ఏపీ అధికార పక్షం వైసీపీ ప్రధాన కార్యదర్శి కం ఏపీ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామక్రిష్ణారెడ్డిపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీకి చెందిన దేవినేని ఉమ.. గూడపాటి లక్ష్మీనారాయణ కంప్లైంట్ తో ఆయనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకూ సజ్జల ఏం మాట్లాడారు? ఎక్కడ మాట్లాడారు? ఆయన చేసిన వ్యాఖ్యలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే..
రెండు రోజుల క్రితం (బుధవారం) వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్ల అవగాహన సదస్సును నిర్వహించారు.
ఇందులో సజ్జల పాల్గొని.. ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణ. ఇంతకూ సజ్జల ఏం మాట్లాడారన్నది ఆయన మాటల్లో చూస్తే.. ‘‘మన టార్గెట్ ఇదీ అని ద్రష్టిలో పెట్టుకొని.. దానికి అవసరమైనవి తెలుసుకోవాలి. అవతలివారు అడ్డం పడకుండా వారిని ఆపేందుకు ఏమేం నిబంధనలు ఉన్నాయో చూసుకోవాలి. మనవి ఒక్క ఓటు కూడా చెల్లనివిగా చేసే పరిస్థితి రాకుండా అడ్డుకునేందుకు ఏం చేయాలో చూసుకోవాలి. అంతే తప్పించి రూల్ అలా ఉంది కాబట్టి.. దాని ప్రకారమే పోదామని మనం కూర్చోకూడదు’’ అని పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలకు కొనసాగింపుగా ఆయన మాట్లాడుతూ.. ‘‘మనకు అనుకూలంగా.. అవతలివాళ్ల ఆటలు సాగకుండా రూల్ ఎలా చూసుకోవాలి? అవసరమైతే దాని కోసం ఎంతవరకు ఫైట్ చేయాలనేది నేర్చుకుందాం. ఇందులో కౌంటింగ్ ఏజెంట్ తన వంతు పాత్ర పోషించేలా వారి మెదడులోకి మీరు బాగా ఎక్కించాలి. పొరపాటున ఒకటి మనం వాదించినా ఫర్లేదు. కానీ.. రూల్ కాదేమో అని వెనక్కి తగ్గేవాడైతే ఏజెంట్ గా వద్దు’’ అని సజ్జల వ్యాఖ్యానించినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుతో సజ్జలపై క్రిమినల్ కేసును నమోదు చేశారు. వివిధ సెక్షన్లు (ఐపీసీ 153, 505, 125) కింద ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. అయితే.. వైసీపీ వర్గాల వాదన వేరేలా ఉంది. అవగాహన కల్పించేందుకు వీలుగా సజ్జల చెప్పిన మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవటం సరికాదంటున్నారు. హోరాహోరీగా సాగుతున్న ఎన్నికల వేళ.. కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వారు మరింత అప్రమత్తంగా ఉండేలా సమాయుత్తం చేయటం తప్పేం కాదు కదా? అంటున్నారు. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును కేసుగా నమోదు చేసేందుకు కఠినమైన సెక్షన్లను పెట్టారంటున్నారు.
సజ్జల నమోదు చేసిన సెక్షన్లు చూస్తే..
సెక్షన్ 153: దుర్మార్గంగా.. చట్టవిరుద్ధంగా ఏదైనా చేయటం ద్వారా కానీ.. రెచ్చగొట్టటం వల్ల కానీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉండటం. తమ మాటలతో రెచ్చగొట్టేలా చేయటం.. అల్లర్లకు పాల్పడే నేరం. ఒక ఏడాది జైలు.. లేదంటే జరిమానా. రెండింటిని ఒకేసారి విధించే వీలుంది.
సెక్షన్ 505: దుష్ప్రచారానికి పాల్పడే ప్రకటనలు చేయటం. దీనికి ఎవరైనా ఉద్దేశించి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు.. జరిమానా. రెండు కలిపి విధించే వీలుంది.
సెక్షన్ 125: చట్టం ద్వారా కానీ చట్టవిరుద్దమైన తప్పిదం ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి ఒక డిజైన్ ఉనికిని దాచిపెట్టి అలజడిని క్రియేట్ చేయటం. పదేళ్ల వరకు పొడిగించే జైలుశిక్ష విధించే వీలుంది. జరిమానా. రెండింటిని కలిపి విధించొచ్చు.