చేతులు అడ్డం పెట్టి.. సూర్యుడిని ఆపడం సాధ్యమా? ప్రపంచంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన వారికి కూడా ఇది సాధ్యం కాలేదు. ఇదే పరిస్థితి ఏపీలోనూ ఉందని అంటున్నారు పరిశీలకులు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీని లేకుండా చేయాలని వైసీపీ అడుగులు వేస్తోందని చెబుతున్నారు. కానీ, ఇది సాధ్యం కాదని తేల్చి చెబుతున్నారు. “వారు ప్రయత్నించవచ్చు. కానీ, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే.. టీడీపీ అంటే.. తెలుగు వారి నరాల్లో జీర్ణించుకుపోయింది“ అని పరిశీలకులు చెబుతున్నారు.
మరికొందరు మేధావులు.. ఇదే విషయంపై మాట్లాడుతూ.. “టీడీపీ జెండాలు తొలగించుకోవచ్చు.. ఫ్లెక్సీలు కూడా అడ్డుకోవచ్చు. కానీ, ప్రజల మనసుల్లో పేరుకుపోయిన అభిమానం మాత్రం తొలగించడం వైసీపీ వల్ల సాధ్యం కాదు.గతంలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా.. ఇదే తరహా ప్రయత్నాలు సాగాయి. కానీ, ఎవరూ అడ్డుకోలేక పోయారు“ అనివారు వివరించారు.
ప్రస్తుతం ఇదే చర్చ అన్ని వర్గాల్లోనూ జోరుగా సాగుతోంది. ఎందుకంటే.. గత ఆరు మాసాల కాలంలో రాష్ట్రంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్ షోలు.. సభలపై కొందరు రాళ్లు విసిరారు. మరికొందరు..అడ్డుకున్నారు. అయినా.. ఆయన హవా ఎక్కడా తగ్గలేదు. ఇక, తాజాగా నారా లోకేష్ చేసిన పాదయాత్రలోనూ వైసీపీ కార్యకర్త ఒకరు.. కోడిగుడ్డు విసిరి.. హంగామా చేసేందుకు ప్రయత్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే టీడీపీని అడ్డుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలపై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.
చేతులు అడ్డం పెట్టో.. రాళ్లు రువ్వో.. కోడిగుడ్లు విసిరో.. టీడీపీని లేకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నా లు సరికావని.. టీడీపీ నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవ పతాకను దశ దిశలా వినిపించిన పార్టీని లేకుండా చేయాలని అనుకోవడం.. సరికాదని మేధావులు భావిస్తున్నారు. దాడులు ప్రతిదాడులతో ఏపీలో రాజకీయంగా యుద్ధం జరగడమూ సరి కాదని అంటున్నారు. మరి ఇలాంటి ఘటనలను నిలువరించేలా సీఎం జగన్ ఎలాంటి ప్రయత్న చేస్తారో చూడాలి.