దేశంలో పిల్లలను కనాలని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు పెరుగుతున్నాయి. ఒకవైపు దేశంలో జనాభా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక జనాభా 142 కోట్లతో భారత్ ముందంజలో ఉంది. అయినప్పటికీ.. వచ్చే 10-15 ఏళ్ల తర్వాత.. పరిస్థితిని ముందుగానే అంచనా వేస్తున్న ప్రభుత్వాలు అప్పటికి వృద్ధులు పెరిగిపోయే అవకాశం ఉందని లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పిల్లల్ని ఎక్కువగా కనాలని చెబుతున్నారు. ప్రస్తుతం చైనా వృద్ధుల సమస్యను ఎదుర్కొం టోంది. ఇక్కడ ఒకప్పుడు జనాభా ఎక్కువగా ఉందని ఆ దేశం కుటుంబ నియంత్రణను కఠినంగా అమలు చేసింది. దీంతో జననాలు పడిపోయాయి.
ఇప్పుడు ఎటు చూసినా చైనాలో వృద్ధ జనాభా పెరిగిపోతోంది. దీంతో పిల్లల్ని కనాలంటూ.. చైనా, ఇటీవల జపాన్ దేశాలు కూడా పిలుపునిచ్చాయి. ఇక, మన దేశం విషయానికి వస్తే.. ఏపీ ప్రభుత్వం కూడా పిల్లల్ని కనాలంటూ పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు తరచుగా పిల్లల్ని కనాలని చెబుతున్నారు. ఇదిలావుంటే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో భాగంగా ఉన్న `పరశురామ్ కల్యాణ్ బోర్డు` ఆసక్తికర ప్రకటన చేసింది. ఈ బోర్డు.. కేవలం బ్రాహ్మణ సంక్షేమం కోసం ఏర్పాటు చేశారు. దీనికి అధ్యక్షుడిగా పండిట్ విష్ణు రాజోరియా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
బ్రాహ్మణ మహిళలారా.. నలుగురేసి పిల్లల్ని కనండి. అలా కన్నాక.. మీకు మా బోర్డు తరఫున లక్షరూపాయలు ప్రోత్సాహకంగా అందిస్తాం. ఇతర సామాజిక వర్గాల(కులాలు) వారు అపరిమితంగా పిల్లల్ని కంటున్న విషయం తెలిసిందే కదా. కానీ, మన సామాజిక వర్గం మాత్రం ఒక్కరితోనే సరిపుచ్చుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్ధం కావడం లేదు. ఇది సరికాదు. మున్ముందు ఒక్కొక్క బ్రాహ్మణ కుటుంబం నలుగురేసి పిల్లల్ని కనాలి. వారికి ప్రోత్సాహం అందుతుంది. మన సంతతిని మనమే వృద్ధి చేసుకోవాలి“ అని రాజోరియా పిలుపునిచ్చారు.
విమర్శలు..
కాగా, రాజోరియా చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని.. ఇది తప్పుకాకపోయినా.. ఇతర కులాలను కించపరిచేలా వ్యాఖ్యానించడం సరికాదని నాయకులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.