ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశ రాజకీయాలతో పాటు తెలుగు రాష్ట్రాలలోని రాజకీయాలను కూడా కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం వ్యవహారం నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి సోదరుడు శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బోయినపల్లి అభిషేక్ రావును కూడా తాజాగా ఈడీ అధికారులు అరెస్టు చేయడం సంచలనం రేపుతోంది. అభిషేక్ రావు తో పాటు మనీష్ సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే వారిని అరెస్ట్ చేసింది. అయితే, వీరి బెయిల్ పిటిషన్ పై ఈరోజు తీర్పు రాబోతున్న నేపథ్యంలో ఈడీ అధికారులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకోవడం విశేషం.
ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జిగా ఉన్న విజయ్ నాయక్, అభిషేక్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ రోజు ఆ బెయిల్ పిటిషన్ పై తీర్పు రానుంది. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నాయర్ ప్రధాన సూత్రధారులలో ఒకరిగా భావిస్తున్నారు. అందుకే లండన్ లో ఉన్న నాయర్ ను విచారణ జరిపేందుకు సిబిఐ అధికారులు భారత్ కు పిలిపించారు. ఆప్ నాయకులకు సన్నిహితుడిగా పేరున్న నాయర్ వారి కార్యక్రమాలను, సోషల్ మీడియా ఖాతాలను నిర్వహిస్తుంటారని తెలుస్తోంది.