తనను ప్రధాని చేసిన సోషల్ మీడియా తనకే నచ్చట్లేదు
మోడీ సర్కారుకు సోషల్ మీడియాలో అత్యంత ప్రధానమైన ఫేస్ బుక్, ట్విట్టరలపై కోపం వచ్చింది.
తాజాగా ఈ సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం నోటీసులు ఇచ్చింది.
గైడ్ లైన్స్ కు అనుగుణంగా నడవట్లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
కఠిన నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది.
అంటే మరి కఠిన నిర్ణయం తీసుకుంటారా ? లేక హెచ్చరికతో వదిలేస్తారా అన్నది పెద్ద అనుమానం.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండింటికి ఆ స్థాయిలో ఇప్పటికిపుడు ప్రత్యామ్నాయం లేదు.
మరి కేంద్రం నిర్ణయం ఏంటో గాని ఈ రెండు బ్యాన్ చేస్తారన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున నడుస్తున్నాయి.
మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిబంధలపై ట్విట్టర్, ఫేస్బుక్ యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించకపోవడం కేంద్రం ఆగ్రహానికి కారణం. కేంద్రం ఇచ్చిన గడువు మే 26 అంటే రేపటితో ముగుస్తున్నది.
ఈ నిర్లక్ష్యాన్ని గవర్నమెంట్ సహించకపోవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియా నుంచి కేంద్రం కోరుతున్నది ఏంటి?
ఏదైనా సమాచారాన్ని తొలగించాలని ప్రభుత్వపరమైన లేదా చట్టబద్ధమైన ఆదేశాలిస్తే 36 గంటలు దాటకుండా దాన్ని పాటించాలి.
సైబర్ సంబంధిత ఘటనలపై అడిగిన 72 గంటల్లోగా ఆయా సంస్థలు సహకారం అందించాలి.
లైంగిక చర్యలకు సంబంధించిన సమాచారంపై ఫిర్యాదు అందిన రోజే తప్పనిసరిగా స్పందించాలి.
జాతి, మతపరమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని పరిశీలించేందుకు కంపెనీ తప్పనిసరిగా అధికారిని నియమించాల్సి ఉంటుంది. ఫిర్యాదుల పరిష్కారానికి మరొక అధికారిని తప్పనిసరిగా నియమించాలి. అయితే ఈ అధికారులు తప్పని సరిగా భారతీయులై ఉండాలని కేంద్రం భావించింది.
ఈ విషయాలపై ట్విట్టర్, ఫేస్ బుక్ ల నుంచి స్పందన లేకపోవడం గమనార్హం.