“ వివేకా ను ఓడించా.. తర్వాత ఆయన నాతో కలిసి చాయ్ తాగారు!. ఆయనతో స్నేహం అంటే అలానే ఉండేది. ఆయనంత మంచి మనిషిని నేను చూడలేదు. కానీ, ఆయనను దారుణంగా హత్య చేశారు. ఇది అత్యంత నీచం“ అని టీడీపీ నాయకుడు, పులివెందు ల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి అన్నారు. వివేకానందరెడ్డి హత్య జరిగి ఐదేళ్లు పూర్తయిన నేపథ్యంలో కడపలో ఆయన సంస్మరణ సభ నిర్వహించారు.
ఈ సభలో బీటెక్ రవి మాట్లాడుతూ.. వివేకాకు రాజకీయం అంటే.. ఎంతో ఇష్టమని.. ఆయన ఎవరినీ ప్రత్యర్థులుగా చూసేవారు కాదని వ్యాఖ్యానించారు. ఆయనతో తనకు మంచి సంబంధం ఉందని చెప్పారు. వివేకాను దారుణంగా హత్య చేయడమేకాకుండా, హత్య వెనుక టీడీపీ నేతల హస్తం ఉందని అన్యాయంగా నింద వేశారని విమర్శించారు. ముందు గుండెపోటు అన్నారని, గుండెపోటుకు తోడు.. రక్తపువాంతులతో చనిపోయారని ఒక డ్రామా క్రియేట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి దారుణాలు ఒక కుటుంబంలో ఆ కుటుంబ సభ్యులే చేస్తారని అనుకోవడం నిజంగా నమ్మలేక పోతున్నామని బీటెక్ రవి అన్నారు.
“నేను ఆయన ఎమ్మెల్సీఎన్నికల్లో పోటీ చేశాం. ఆయన ఓడిపోయారు. తర్వాత రోజు నాకు ఆయన ఫోన్ చేశారు. చాయ్ తాగుతాం రాబ్బా అన్నారు. పోయా.. కొద్దిసేపు నా కుటుంబం గురించి అడిగినాడు. ఎంత మంచి మనిషంటే..“ అని రవి అన్నారు. సంస్మరణ సభను పులివెందులలోనే నిర్వహించాలని వివేకా కుటుంబ సభ్యులు భావించారని… అయితే, సభకు ఒక ఫంక్షన్ హాల్ కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారని బీటెక్ రవి తెలిపారు. ఈ నేపథ్యంలో, సభను కడపలో నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివేకా కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసని చెప్పారు. వివేకాపై తాను పోటీ చేసి గెలిచినప్పటికీ ఆయన తనతో ఎంతో బాగా మాట్లాడేవారని తెలిపారు. వివేకా సొంతింటి వారి చేతిలో హత్య కు గురవడంపై పులివెందుల వాసిగా తాను సిగ్గుపడుతున్నానని చెప్పారు.