లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఘన వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు అమీన్ కూడా సంగీత ప్రవేశమే చేశాడు. అతను చిన్న వయసులోనే ‘ఓకే కాదల్’ లాంటి సినిమాల్లో చక్కటి పాటలు పాడి తన ప్రతిభను చాటుకున్నాడు. యుక్త వయసులోకి వచ్చాక మరిన్ని పాటలు పాడి మెప్పించాడు. అమీన్ తాజాగా ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తమిళనాడులో ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా.. తనకు ప్రాణాపాయం తప్పిన విషయాన్ని అతను ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు అమీన్.
ఈ ప్రమాదం చోటు చేసుకుని మూడు రోజులు దాటిందని.. కానీ ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయట పడలేకపోతున్నానని అమీన్ తెలిపాడు. ఈ ప్రమాదం గురించి.. ఇంకా అతనేమన్నాడంటే.. ‘‘నా టీంతో కలిసి ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేస్తుండగా.. క్రేన్‌కు ఏర్పాటు చేసిన కొన్ని వస్తువులు, లైట్లు కింద పడిపోయాయి. ఈ ప్రమాద సమయంలో నేను సమీప దూరంలోనే ఉన్నాను. పై నుంచి కింద పడ్డ వస్తువుల్లో ఒక భారీ షాండ్లియర్ కూడా ఉంది. ఏమాత్రం కొంచెం అటు ఇటు అయినా అవి మా తలపై పడేవి. అదృష్టంకొద్దీ మేం ప్రమాదం తప్పించుకున్నాం.
ఈ ఘటనతో మా టీం అంతా షాకైంది. ఇప్పటికీ దాన్నుంచి తేరుకోలేకపోతున్నా. ఆ భగవంతుడు, తల్లిదండ్రులు, అభిమాను ఆశీర్వాదం వల్లే నేను ఆ రోజు ప్రమాదం నుంచి తప్పించుకున్నా. లేదంటే చాలా పెద్ద ఘోరమే జరిగి ఉండేది’’ అని అమీన్ అన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు కూడా కొన్ని అమీన్ షేర్ చేశాడు. అమీన్ ప్రస్తుతం సొంతంగా మ్యూజిక్ వీడియోలు చేసే స్థాయికి ఎదిగాడంటే.. భవిష్యత్తులో తండ్రి బాటలో సంగీత దర్శకుడే అవుతాడేమో.