ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలకు నిర్వహించిన ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతంగా మారాయి.
అనేక వైసీపీ, టీడీపీ వర్గాలు కొట్లాటలకు దిగాయి. కొన్ని చోట్ల వైసీపీలోనే రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. మరికొన్ని చోట్ల బీజేపీ కూడా జతకలిసింది.
పలు చోట్ల రాళ్ల దాడులూ జరగడంతో కొందరు గాయపడ్డారు. దీంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్న చోట ఎన్నికలను వాయిదా వేశారు.
విశాఖ జిల్లా రావికమతం మండలంలోని గుడ్డిబా ప్రాథమికోన్నత పాఠశాల చైర్మన్ పదవిని రూ. 1.60 లక్షలకు వేలం వేశారు.
ఈ పాఠశాలలో ‘నాడు-నేడు’ కింద కోట్ల రూపాయల విలువ చేసే పనులను తల్లిదండ్రుల కమిటీ ద్వారా చేస్తుండడంతో ఈ పదవికి గిరాకీ ఏర్పడింది.
చివరికి ఓ వ్యక్తి వేలంలో ఈ పదవిని కొనుక్కున్నారు. కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో పూర్తిగా ఘర్షణ వాతావరణం నెలకొంది.
వైసీపీ, టీడీపీ వర్గాలు బాహాబాహీకి దిగి రాళ్లతో పరస్పరం దాడులకు దిగారు. ఘర్షణల్లో పలువురు గాయపడ్డారు.
కడప జిల్లా వీరపల్లె మండలంలోని ఉప్పరపల్లె, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి, విశాఖ జిల్లా గణపర్తి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల కమిటీ, గుంటూరు జిల్లాలో 160 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి.
రాష్ట్రంలో తల్లిదండ్రుల కమిటీ ఎన్నికలు 94.91 శాతం పూర్తయ్యాయని, మొత్తం 46,609 స్కూళ్లకు ఎన్నికలు నిర్వహించగా 44,237 పాఠశాలల్లో ఎన్నికలు పూర్తయినట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు.
19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు చెప్పారు.