ఐటీ శాఖా మంత్రిగా లోకేష్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏపీకి ఐటీ పరిశ్రమలతోపాటు పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టుబడులు పెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ తమ సంస్థలను విశాఖలో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే న్యూఢిల్లీలో ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాము ఇతర రాష్ట్రాలతో కాకుండా ఇతర దేశాలతో పోటీపడుతున్నామని మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐ సి ఏ చైర్మన్ పంకజ్ మహేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లోకేష్ మాట్లాడారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ హబ్ గా మార్చేందుకు చేపడుతున్న చర్యలు, రాష్ట్రంలో ఉన్న అనుకూల పరిస్థితులపై పారిశ్రామికవేత్తలకు లోకేష్ వివరించారు. పారిశ్రామికవేత్తలకు ఎదురయ్యే ఇబ్బందులు, సవాళ్లను అధిగమించి వారు పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనలో ఐటీ ,ఎలక్ట్రానిక్స్ రంగాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.