వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి రోజా కు సొంత నియోజకవర్గం నగరిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీలోని ఓ వర్గం నేతలు రోజాను చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. జడ్పీటీసీ సభ్యుడు మురళీధర్ రెడ్డితో పాటు చాలామంది రోజాపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. రోజా సోదరుల అక్రమాలు, దౌర్జన్యాలతో నష్టపోయామని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ వారు నిరసనకు దిగారు. రోజా వద్దు జగన్ ముద్దు అంటూ రోజా వ్యతిరేక వర్గం ముందుకు రావడం ఆమెకు షాక్ ఇచ్చినట్లయింది.
నగరిలో మంత్రి రోజాకు సీటు ఇస్తే ఓడిపోవడం ఖాయం అంటూ అసంతృప్త నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నగరి నియోజకవర్గంలోని 5 మండలాల నేతలు రోజాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రోజాకు టికెట్ ఇవ్వొద్దంటూ జగనన్న ముద్దు రోజా వద్దు అని వారు ప్లకార్డులు ప్రదర్శించారు. తమ మద్దతుతోనే నగరి నుంచి రోజా రెండుసార్లు గెలిదారని, సొంత చరిష్మాతో రోజా గెలిచే పరిస్థితి లేదని వారు అంటున్నారు. రోజాకు మద్దతు ఇవ్వబోమని కార్యకర్తలు చెబుతున్నారు.
కార్యకర్తలంటే రోజాకు చులకన అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అనుచరులపై పోలీసులతో రోజా సోదరులు తప్పుడు కేసులు పెట్టించి ఇబ్బందులపాలు చేశారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు. ఇక, తమను జగన్ బుజ్జగించారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. రోజా వల్ల నగరిలో పార్టీకి డ్యామేజీ జరిగిందని చెబుతున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని జగన్ గమనించి రోజాకు టికెట్ కేటాయించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే, మార్చి 16వ తేదీన వైసీపీ అభ్యర్థుల జాబితా విడుదల కాబోతున్న నేపథ్యంలో దానికి ఒక రోజు ముందు రోజాకు టికెట్ ఇవ్వద్దంటూ రోజా వ్యతిరేక వర్గం సభ్యులు నిరసనలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి, రోజాకు జగన్ టికెట్ ఇస్తారా లేక మొండి చేయి చూపిస్తారా అన్నది తేలాల్సి ఉంది.