టీవీ యాంకర్, నటుడు ప్రదీప్ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఏపీ రాజధాని విశాఖ అంటూ ఓ షోలో ప్రదీప్ వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది. ప్రదీప్ వ్యాఖ్యలు అమరావతి రైతులను, ఉద్యమాన్ని అవమానించేలా ఉన్నాయని ఏపీ పరిరక్షణ సమితి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుంటే హైదరాబాద్లోని ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాసరావు వార్నింగ్ ఇచ్చారు.
కోర్టులో ఉన్న అంశాలపై ప్రదీప్ వ్యాఖ్యానించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై యాంకర్ ప్రదీప్ స్పందించారు. తన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని తన సొంత యూట్యూబ్ చానెల్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను ఆ షోలో పొరపాటున అడిగిన ప్రశ్నకు షోలో పాల్గొన్న వ్యక్తి వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ సంభాషణ తప్పు దోవ పట్టిదని ప్రదీప్ వివరణ ఇచ్చారు.
ఆ షోలో రాష్ట్రం-దాని క్యాపిటల్ ఏంటి అనే ప్రశ్న అడుగుతున్నానని, పొరపాటున రాష్ట్రానికి బదులు సిటీ పేరు చెప్పి, ఆ సిటీ క్యాపిటల్ ఏంటి అని అడిగానని, మీ ప్రశ్న తప్పు అని చెప్పకుండా అవతలి వ్యక్తి వేరే ఆన్సర్ ఇవ్వడంతో ఈ పూర్తి సంభాషణ తప్పు దోవలో వెళ్లిందని వివరణ ఇచ్చారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఎవరినో కించపరచాలనో, హేళన చేయాలనే ఉద్దేశం తనకు లేదని క్లారిటీ ఇచ్చారు.
మరి, ప్రదీప్ క్షమాపణలను ఏపీ పరిరక్షణ సమితి స్వీకరించి ఈ వివాదానికి పుల్ స్టాప్ పెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. గతంలోనూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. తనపై విమర్శలు వచ్చిన తర్వాత ప్రదీప్ పోలీసుల కౌన్సిలింగ్ కు హాజరు కావడంతో వివాదం సద్దుమణిగింది.