ఫాక్స్ న్యూస్ టక్కర్ కార్ల్సన్ షోలో ఇటీవల ప్రొఫెసర్ అమీ వ్యాక్స్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) అధ్యక్షురాలు డాక్టర్ అనుపమ గొట్టిముక్కల తీవ్రంగా ఖండించారు. భారతీయ వైద్యులపై ఆమె చేసిన జాత్యహంకార వ్యాఖ్యలను తొలగించాలని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ అధ్యక్షుడికి అనుపమ గొట్టిముక్కల లేఖ రాశారు.
యూనివర్శిటీ తక్షణమే వ్యాక్స్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని, ఆమె జాత్యహంకార వ్యాఖ్యలపై విచారణ జరిగే వరకు ఆమెను గైర్హాజరులో ఉంచాలని అనుపమ అభ్యర్థించారు.
వాక్స్ మూర్ఖత్వంతో చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని పేర్కొన్నారు. అత్యంత దారుణమైన ఈ వ్యాఖ్యలపై బహిరంగ కమిటీతో విచారణను ప్రారంభించాలని కోరారు. వ్యాక్స్, యుపెన్ నుంచి క్షమాపణలు కోరాలని అభ్యర్థించారు. ఇటీవలి ఫాక్స్ న్యూస్ నిర్వహించిన షోలో అమీ వాక్స్ భారతదేశం ఒక ‘షిథోల్ కంట్రీ’ అని కొన్ని జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోని భారతీయ వైద్యుల గురించి మతోన్మాద వ్యాఖ్యలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భారతీయ మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అమెరికాలోని భారత సంతతి వర్గంలో తీవ్ర దుమారం రేపాయి. దీంతో చర్యలు కోరుతూ.. అనుపమ గొట్టిముక్కల పెన్సిల్వేనియా యూనివర్సిటీకి లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వ్యాక్స్ ఇంటర్వ్యూ ఏప్రిల్ 18, 2022న ప్రసారం అయింది. 40 లక్షల మందికి పైగా ఉన్న భారతీయ అమెరికన్ డయాస్పోరాలో వ్యాక్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆవేదనను మిగిల్చినట్టు అనుపమ తెలిపారు. అమెరికా, భారతదేశాల మధ్య బలమైన ప్రజల-ప్రజల సంబంధాలను ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలు బాధించాయన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలపై ఈ వ్యాఖ్యలు ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
భారతీయ సంతతి వైద్యుల భాగస్వామ్యం ఎంతో కీలకమైన అమెరికాలో.. ప్రొఫెసర్ వ్యాక్స్ భారతదేశాన్ని ‘షిథోల్ కంట్రీ’గా పేర్కొనడం అమెరికా-భారత సంబంధాల ప్రాథమిక లక్ష్యాలను నాశనం చేయడమే కాకుండా భారతీయ సంతతికి చెందిన వైద్యులపై ప్రభావం పడేలా చేసిందన్నారు. అంతేకాకుండా.. మహిళలపై కూడా ద్వేషపూరిత నేరాలను ప్రేరేపిస్తోందన్నారు.
1982లో స్థాపించబడిన అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) అమెరికాలో లక్షకు పైగా వైద్యుల సంఘటిత శక్తిగా ఉందని అనుపమ తెలిపారు. ఈ అసోసియేషన్ దేశంలో 40,000 కంటే ఎక్కువ మంది వైద్య విద్యార్థులు, నివాసితులు, భారతీయ సంతతికి చెందిన సహచరులకు అనేక రూపాల్లో సేవ చేస్తోందని తెలిపారు.
AAPI YPS/MSRF (యంగ్ ఫిజిషియన్స్ విభాగం/మెడికల్ స్టూడెంట్స్, రెసిడెంట్స్ మరియు ఫెలోస్ సెక్షన్) అనేది AAPI యొక్క కీలకమైన, అంతర్భాగంగా పేర్కొన్నారు. AAPI నాయకత్వం వైద్య రంగంలో వారి భాగస్వామ్యం, సహకారం అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అమెరికాలో ప్రతి ఏడుగురిలో ఒకరి ఆరోగ్య సంరక్షణలో ఏదో ఒక సమయంలో భారతీయ వైద్యులు సేవలు అందిస్తున్నారని వివరించారు.