ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. జగన్ పై చేస్తున్న విమర్శలు హద్దులు లేకుం డా ఉన్నాయి. ఇది మంచో చెడో పక్కన పెడితే.. టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా మరింత దూకుడు పెంచారు. “హత్యలు చేసిన వారు.. చేయించిన వారే.. జగన్‌కు మిత్రులు“ అని సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు ఎస్సీ నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు .. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు తరఫున ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ కు మిత్రులు వారే నంటూ.. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ అవినాష్‌రెడ్డిల పేరు చెప్పి మరీ విరుచుకుపడ్డారు. “ఒకాయన కారు డ్రైవర్‌ను చంపేసి.. డోర్ డెలివరీ చేశాడు. ఆయన పేరు అనంత బాబు. ఆయనంటే జగన్‌కు మహా ప్రేమ. ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలు అప్పగించారంట. కానీ, జనాలు ఆయనను తరిమి కొడుతున్నారు. మరో ఆయన సొంత బాబాయినే గొడ్డలితో నరికించి చంపారు. ఆయన పేరు అవినాష్‌రెడ్డి. వీరే జగన్‌కు మిత్రులు.. హత్యలు చేసిన వారు.. చేయించిన వారు.. ఆయనకు కుడి-ఎడమ భుజాలు. ఇప్పుడు తేల్చుకోండి జగన్ కావాలో అభివృద్ధి చేసే టీడీపీ కావాలో“ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
వైసీపీ హయాంలో రాష్ట్రంలో 200 మందిపై హత్యలు జరిగాయన్నారు. వీటిపై ఇప్పటి వరకు చర్యలు లేవని చెప్పారు. హత్యారాజకీయాలకు వైసీపీ కేరాఫ్‌గా మారిపోయిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పాలన రాష్ట్రానికి అవసరమా? అని వ్యాఖ్యానించారు. రేపు మరోసారి అధికారంలోకి వస్తే.. హంతకులకు లైసెన్సు ఇచ్చే పథకానికి కూడా జగన్ శ్రీకారం చుట్టే అవకాశం ఉందని హెచ్చరించారు. సొంత చెల్లెళ్లను రోడ్డున పడేసిన జగన్.. మహిళా ఉద్ధారకుడిగా కథలు చెబుతున్నాడని మండిపడ్డారు.
“నేను ఒక్కటే అడుగుతున్నా. ఈ రోజు ఈ సొంత చెల్లెళ్లు రోడ్డున ఎందుకు పడ్డారో జగన్ మోహన్‌రెడ్డి ప్రజలకు చెప్పాలి. పులివెందులలో చెప్పాలి. అప్పుడే ఓట్లు అడగాలి. సొంత చెల్లెళ్లకు న్యాయం చేయని జగన్ మోహన్‌రెడ్డి.. మహిళలకు ఏం న్యాయం చేస్తాడు. మేం వస్తే.. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కడ నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు. వారికి అన్ని విధాలా భద్రత కల్పిస్తాం“ అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, తన ప్రసంగంలో చంద్రబాబు మరిన్ని విషయాలు పేర్కొన్నారు. పొత్తులు ఎందుకు పెట్టుకున్నారో.. మరోసారి వివరించారు. సూపర్ సిక్స్ పథకాలను వివరించారు.
అధికారంలోకి వచ్చాక, భూరక్షణ చట్టం రద్దు చేస్తాం#PrajaGalamForDemocracy #PrajaGalam #TDPJSPBJPWinning #AndhraPradesh pic.twitter.com/eKfWjMYuxc
— Telugu Desam Party (@JaiTDP) April 12, 2024