విషయం చెప్పుకొనే ముందు.. ఖచ్చితంగా ఎనిమిదేళ్ల కిందటకు వెళ్దాం.. అప్పట్లో రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ పేరు మార్మోగింది. ఇక, అంతో ఇంతో .. ముఖేష్ అంబానీ పేరు కూడా వినిపించింది. ఇక, తమిళనాడుకు చెందిన.. కనిమొళి, రాజా వంటివారి పేర్లు కూడా వినిపించాయి. దీనికి కారణం.. అప్పటి యూపీఏ సర్కారు వారికి సహకరించడంతో ఇండస్ట్రియల్‌గా వారి పేర్లు మార్మోగాయనే పేరు వచ్చింది.
ఇక, అదేసమయంలో గౌతమ్ అదానీ.. పేరు ఎక్కడా వినిపించలేదు. ఒకవేళ వినిపించినా.. గుజరాత్‌కే పరిమితమైంది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా అసలు ఆయన ఎవరో కూడా ఎవరికీ తెలియదు. అంటే.. ఎనిమిదేళ్ల కిందట.. గౌతమ్ అదానీ అనే వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా జీరో.. కానీ.. ఇప్పుడు అదే గౌతమ్ అదానీ ప్రపంచ హీరో..! నమ్మలేరా.. కానీ, నిజం! ప్రపంచ అపరకుబేరుల లిస్ట్ తాజాగా వచ్చింది. దీనిలో రెండో స్థానంలో గుజరాత్‌కు చెందిన అదానీ ఉన్నారు.
నికర సంపదలో అత్యంత వేగంగా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ.. తాజాగా ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరారు. సంపద విలువ పరంగా ఆయన కంటే ముందు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మాత్రమే ఉన్నారని ఫోర్బ్స్ రియల్-టైమ్ బిలియనీర్స్ సూచీ వెల్లడిస్తోంది.
అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్, ఫ్రాన్స్‌కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కి నెట్టి అదానీ రెండో స్థానానికి ఎగబాకారు. ఈ స్థాయికి చేరిన తొలి భారత, ఆసియా వ్యక్తి అదానీయే. స్టాక్ మార్కెట్ కదలికలకు అనుగుణంగా కుబేరుల సంపద ఎప్పటికప్పు డు మారుతూ ఉంటుంది.
ఈ నేపథ్యంలో జాబితాలోని వ్యక్తుల స్థానాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫోర్బ్స్ వివరాల ప్రకారం.. అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు రాణించాయి. దీంతో ఆయన సంపద 5.5 బిలియన్ డాలర్లు పెరిగింది. 155.7 బిలియన్ డాలర్ల నికర సంపదతో కుబేరుల జాబితాలో రెండో స్థానానికి చేరారు.
విలాస వస్తువుల కంపెనీ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ 155.2 బి.డాలర్లతో మూడో స్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్ 149.7 బి.డాలర్లతో నాలుగో స్థానానికి చేరారు. భారత్‌కు చెందిన మరో కుబేరుడు ముకేశ్ అంబానీ ఈ జాబితాలో 92.3 బిలియన్ డాలర్ల సంపదతో 8వ స్థానంలో నిలిచారు.
అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పవర్, అదానీ ట్రాన్స్మిషన్స్లో గౌతమ్ అదానీకి 75 శాతం వాటాలున్నాయి. అదానీ టోటల్ గ్యాస్‌లో 37 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో 65 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 61 శాతం వాటాలు ఆయన పేరిట ఉన్నాయి.
మోడీ అండ!
అదాని ఈ రేంజ్లో తారాజువ్వ మాదిరిగా ఎదిగిపోవడానికి ప్రపంచ వాణిజ్య రంగంలో ఉన్నతస్థాయికి చేరడానికి ఖచ్చితంగా గుజరాత్‌కే చెందిన ప్రధాని నరేంద్ర మోడీ అండదండలు ఉన్నాయని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. గత కొన్నాళ్లుగా ఆయన దేశంలోని అన్ని తీర ప్రాంత రాష్ట్రాల్లోనూ పోర్టులు కడుతున్నారు. ఇప్పటికే కట్టారు.
అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ, పవర్, పోర్టులు.. విమానాశ్రయాలు.. ఒకటేమిటి.. ఆయన ఏది పట్టుకున్నా.. అనుమతులు వచ్చేస్తాయి.. ఆయన ఏది ముట్టుకున్నా.. బంగారం అయిపోతోంది. సో.. అదానీ వెనుక మోడీ ఉన్నారనేది విపక్షాల మాట.. లేకపోతే.. ఇంత తక్కువ కాలంలో అంత ఎత్తు ఎదగడం అంటే.. మాటలా?!