ఒకటి కాదు..రెండుకాదు.. ఏకంగా ఆరు అంశాలకు సంబంధించి గత వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందనే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైట్ పేపర్స్ విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. వీటిలో పోలవరం, ఆర్థికం, అమరావతి, శాంతిభద్రతలు, పర్యావరణం, మద్యం అంశాలు. వీటిపై శ్వేత పత్రాలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖల మంత్రులకు చంద్రబాబు సూచించారు.
ఏం చెబుతారు?
+ పోలవరం: వైసీపీ పాలనలో రివర్స్ టెండర్ల ద్వారా.. అప్పటి వరకు ఉన్న నవయుగ కాంట్రాక్టు సంస్థను తప్పించి మేఘాకు దీనిని కట్టబెట్టారు. దీంతో పనులు ఆగిపోయాయి. పైగా డ్యాం ఎత్తును ఆర్థిక పరమైన అంశాలు.. కేంద్రం ఒత్తిడితో తగ్గించారన్న విమర్శలు వున్నాయి. అదేసమయంలో పునరావాసానికి గత సర్కారు ఎంత ఖర్చు చేసింది. ఇప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయనేది వివరించే చాన్స్ ఉంది.
+ ఆర్థికం: గత పాలనలో జగన్ చేసిన అప్పులతోపాటు.. కేంద్రం ఇచ్చిన పన్నుల వాటాలను ఏం చేశారు? ఏయే పథకాలకు ఎంతెంత ఖర్చు చేశారు. ఏయే సంస్థలను తాకట్టు పెట్టి తీసుకువచ్చారనేది వివరించనున్నారు. అదేసమయంలో పక్కదారి పట్టిన పంచాయతీ నిధుల వివరాలు కూడా.. చెప్పే అవకాశం ఉంది.
+ అమరావతి: రాజధాని అమరావతిని నిలిపివేసిన జగన్ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన రహదారుల అనుమతిని కూడా వదిలేసింది. అదేసమయంలో రైల్వే ప్రాజెక్టులను కూడా పక్కదారి పట్టించింది. అదేసమయంలో ఇక్కడ చేసిన భూముల పందేరం.. రైతులను వేధించిన తీరును వివరించే అవకాశం ఉంది.
+ శాంతి భద్రతలు: వైసీపీ పాలనలో పోలీసుల తీరు. అక్రమ కేసులు.. తీసువచ్చిన జీవో 1 చట్టం సహా ప్రతిపక్షాలను ఏవిధంగా వేదించారనే విషయాలను వివరించే అవకాశం ఉంది.
+ పర్యావరణం: పర్యావరణానికి హాని కలిగిస్తూ.. రుషికొండ ను తొవ్వేసి కట్టిన విలాసవంతమైన భవనాల నిర్మాణం సహా.. చెరువులు పూడ్చి నిర్మించిన పార్టీ కార్యాలయాలను వివరిస్తారు. అదేవిధంగా వైసీపీ నాయకులు చెలరేగి చేసిన.. గనుల తవ్వకాలతోపాటు, ఇసుక విధానం.. నదీగర్భాలను తోడేసిన విధానాన్ని శ్వేత పత్రంలో వివరించే అవకాశం ఉంది.
+ మద్యం: వైసీపీ హయాంలో తీసుకువచ్చిన లిక్కర్ విధానంపై.. సమగ్ర వివరాలతోపాటు.. ఎంత మంది మరణించారు. చీపు లిక్కరు ధరలను పెంచడం.. నిధులు ఎటు మళ్లాయనే వివరాలతోపాటు.. బార్ లైసెన్సులు ఎంత మందికి ఎలా ఇచ్చారనే వివరాలు శ్వేత పత్రంలో ఉండే అవకాశం ఉంది.