సస్పెన్షన్ లో ఉన్న న్యాయమూర్తి రామకృష్ణ వ్యవహారం ఏపీలో ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే మారిపోతోంది. ఎప్పుడో ఏడేళ్ల క్రితం ఏదో కేసులో సస్పెన్షన్ వేటు పడిన రామకృష్ణ దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. నాటి నుంచి ఆయన తన పోస్టింగ్ కోసం ఏదో తంటాలు పడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు రామకృష్ణ, ఆయన కుటుంబంపై వైసీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారిపోయింది.
ఇప్పటికే జడ్జి రామకృష్ణ, చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల మధ్య నడుస్తున్న వైరం.. ముదిరి పాకాన పడినట్టుంది. ఇందులో భాగంగానే ఆదివారం రామకృష్ణ సోదరుడు రామచంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రామచంద్ర… ప్రస్తుతం మదనపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆదివారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే… బి.కొత్తకోట మెయిన్రోడ్లో సరుకులు తీసుకుంటున్న రామచంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో దాడి చేశారు. కర్ణాటక రిజిస్ట్రేషన్ కలిగిన కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు ఈ దారుణానికి తెగబడ్డారు. అనంతరం వారందరూ అదే కారులో పరారయ్యారు. స్థానిక వైసీపీ నాయకులతో కలిసి దుండగులు ఈ దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామచంద్ర పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేకున్నా… పట్టపగలు ఓ జడ్జి సోదరుడిపై దాడి జరగడం నిజంగానే కలకలం రేపే అంశమే.
వైసీపీ ప్రభుత్వంలో అధికారిక పదవిలో ఉన్న రిటైర్డ్ జడ్జి జస్టిస్ ఈశ్వరయ్యకు మధ్య జరిగిన సంభాషణ అంటూ ఇటీవల వెలుగుచూసిన ఓ ఆడియో పెను కలకలమే రేపింది. ఈ ఆడియోటేపులో పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై జస్టిస్ ఈశ్వరయ్య అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అదే సమయంలో దళితుడైన జడ్జి రామకృష్ణకు అండగా నిలిచేందుకు కూడా టీడీపీ వెనుకాడలేదు.
ఈ క్రమంలో ఓ స్థల వివాదాన్ని ఆసరా చేసుకుని మంత్రి పెద్దిరెడ్డి,అయన అనుచరులు రామకృష్ణపై పగబట్టారన్న వార్తలు కూడా కలకలం రేపుతున్నాయి. ఇలాంటి వార్తల నేపథ్యంలో జడ్జి రామకృష్ణ సోెదరుడు రామచంద్రపై గుర్తు తెలియని వ్యక్తులు ఏకంగా హత్యాయత్నానికి పాల్పడటం నిజంగానే కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో ఈ దాడికి పాల్పడిన వారు గుర్తు తెలియనివారే అయినా.. వారి వెనుక ఉన్నది మాత్రం వైసీపీ నేతలేనని అంతా భావిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.