బాలూ-తెలుగు హీరోలను క్షమించండి

Movies Sep 28, 2020

నీవు బతికున్నప్పుడు అన్నాయ్యా అన్నారు, నీవు బతికున్నప్పుడు గాన గంధర్వుడని పొగిడారు, నీవు బతికున్నప్పుడు పొగడ్తలతో ముంచెత్తారు.

ఇప్పుడు నీవు లేవు కదా నీతో వీరికి అవసరం తీరిపోయింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నీకు నీవు సినీ రంగానికి రాకముందు నుంచి పరిచయమట కదా?

మెగాస్టార్ చిరంజీవి నీకు తమ్ముడిలాంటి వాడినని చెప్పుకునేవాడట కదా? బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ నుంచి బన్నీ వరకూ అందరూ నిన్ను గౌరవించేవారట కదా? నీవు మరలిపోగానే ఆ గౌరవం ఏమైందో..????

ముఖ్యమంత్రులు పిలిస్తే చార్టెడ్ ఫ్లైట్లు వేసుకుని మరీ వాలిపోయే ఈ 'తెర హీరో'లు నీ కడసారి దర్శనానికి తెరచాటుకు వెళ్లిపోయారేమిటో? కరోనా భయమా? తమిళనాడు ప్రభుత్వ పెద్దలు నీ దగ్గరకు వచ్చారు.

కమల్ హసన్ లాంటి వారు ఆసుపత్రి నుంచి నీతోనే ఉన్నారు. వీరందరిని మించి అశేష జనవాహిని నిన్ను చూడటానికి వచ్చారే.. మరి ఈ 'జీరో'లకు ప్రాణ భయమా? నిన్ను చూస్తేనే కరోనా వస్తుందా?

అశ్వినీదత్, రాఘవేంద్రరావు లాంటి వాళ్లు వాళ్ల చిత్రాలకు నీవు పాడిన పాటల లెక్కలు చెబుతున్నారు. ఒక్కరూ నీ కడసారి చూపునకు రాలేదే? ఎందరో నిర్మాతలను నీ గొంతుతో బతికించావు.

ఎందరో దర్శకులకు జీవితాన్నిచ్చావు. లెక్కలేనంత మంది హీరోలకు పేరు తెచ్చావు. ఒక్కడూ నిన్ను కడసారి చూసేందుకు రాలేదు. ఇలా చేసింది ఒక్క తెలుగు నటులే సుమా. ఇతర భాషల వారు నిన్ను మర్చిపోలేదు.

నీతో అవసరం తీరిందని మొహం చాలేయలేదు. కన్నడ మీడియా ఏం చెప్పిందో తెలుసా బాలూ? మరో జన్మమంటూ ఉంటే బాలసుబ్రహ్మణ్యం మా గడ్డపై పుట్టాలని నినదించింది.

తమిళ ప్రజలు ఏమన్నారో తెలుసా బాలూ? ''బాలసుబ్రహ్మణ్యం ది ప్రైడ్ ఆఫ్ తమిళనాడు'' అన్నారు. అన్నట్లు సమైక్య ఆంధ్రాలోగానీ రెండుగా విడిపోయిన తర్వాత కానీ రెండు తెలుగు రాష్ట్రాలూ నీకు పెదవి చివరి పొగడ్త తప్ప మరేమీ అందివ్వలేదు.

నీకు పద్మా అవార్డుకు తమిళనాడు ప్రభుత్వం సిఫార్సు చేసింది. తెలుగుకు పట్టిన ఈ తెగులును వదిలించడానికి నీవు ఎంతో శ్రమ పడ్డావు. 'ళ' అక్షరానికి 'ల' అక్షరానికి తేడా కూడా తెలియకుండా మాట్లాడే వారికి వివేచన కల్పించావు.

మరి ఈ తెలుగు హీరోలకు, నాయకులుకు బుద్ధి వచ్చే పని ఒక్కటైనా చేశావా? చేయలేదు. అందుకే ఈ తెగులు నేతలకు, తెగులు హీరోలకు నీవంటే అంత చులకన.

అన్నట్టు మరచ్చిపోయాను బాలూ, ఈ తెగులు హీరోల నుంచి ఇలాంటి అనుభవం పొందిన వాడిని నీవే అనుకుంటున్నావా? కాదు సుమా, నీకన్నా పెద్దవాడు, మధుర గాయకుడు ఘంటసాల మాస్టారికి కూడా ఇదే అనుభవం ఉంది.

ఘంటసాల మాస్టారు నీలానే కన్ను మూసినప్పుడు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వెళ్లలేదు. ఎన్టీరామారావు 'తాతమ్మకల' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడట.

అక్కినేని నాగేశ్వరరావు ' ఘంటసాలను ఆ పరిస్థితుల్లో చూడలేను. అందుకే వెళ్లను' అని స్టేట్ మెంట్ ఇచ్చేశారట. నీకు తెలుసు కదా బాలూ, ఘంటసాల మాస్టారు లేనిదే ఈ ఇద్దరూ లేరు.

అయినా సరే వారు ఘంటసాల మాస్టారి కడసారి చూపునకు వెళ్లలేదు. అందుకే నీవు మనసులో ఏమీ పెట్టుకోవద్దు బాలూ. ఈ జీరోలు వచ్చినా రాకపోయినా నీవు మా వాడివి.

నీవు మా గుండెల్లో ఉంటావు. నీ విషయంలోనే కాదు ఘంటసాల మాస్టారి కడసారి చూపు కోసం వేలాది మంది తరలి వచ్చారు. అచ్చు నీకు జరిగినట్లుగానే సాంప్రదాయబద్దంగా మాస్టారి అంత్యక్రియలు జరిగాయి.

మీరిద్దరూ ఇప్పుడు ఇంద్ర సభలో కలిసినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకోవద్దు. ఈ తుచ్ఛ మానవులను క్షమించండి... అందులోనూ తెలుగు హీరోలను క్షమించండి.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.