జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్ లో మార్క్ శంకర్ చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదంలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. బాబు ఊపిరితిత్తులలోకి పొగ చేరడంతోపాటు ఒంటిపై మంటల తీవ్రత వల్ల కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి దంపతులు, పవన్ కల్యాణ్ వెళ్లారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మార్క్ శంకర్ ఇంటికి వచ్చేశాడని చిరంజీవి వెల్లడించారు.
తమ బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడని, కానీ, ఇంకా పూర్తిగా కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని చిరు చెప్పారు. తమ కులదైవం ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే మార్క్ శంకర్ పూర్తి ఆరోగ్యవంతుడవుతాడని, మామూలుగా ఎప్పటిలానే ఉంటాడని చిరు అన్నారు. రేపు హనుమాన్ జయంతి అని, ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని తమ దైవం కాపాడి తమకు అండగా నిలిచాడని చిరు ఎమోషనల్ అయ్యారు.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో ఎందరో అభిమానులు ప్రార్థించారని, చాలామంది తమ కుటుంబానికి అండగా నిలబడి ఆశీస్సులు అందించారని గుర్తు చేసుకున్నారు. తన తరఫున, తన తమ్ముడు పవన్ కల్యాణ్ తరపున, తమ కుటుంబం యావన్మంది తరపున బాబు కోలుకోవాలని కోరుుకున్న అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు. మార్క్ శంకర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలియడంతో మెగా అభిమానులు, జనసైనికులు ఊపిరి పీల్చుకున్నారు.