క్వార్ట్జ్ అక్రమ మైనింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ గత పది రోజులుగా పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. కాకాణి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని 3 సార్లు నోటీసులిచ్చినప్పటికీ ఆయన తప్పించుకు తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో ముగ్గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చిన్న అల్లుడు గోపాలకృష్ణా రెడ్డితో పాటు కాంట్రాక్టర్ ఊరుబిండి ప్రభాకర్ రెడ్డి, ఊరుబిండి చైతన్యలకు పోలీసులు నోటీసులిచ్చారు.
నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని తెలిపారు. విచారణకు హాజరయ్యేందుకు వీరు ముగ్గురూ సమయం కోరారు. మైనింగ్ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు వీరిని విచారణ జరపాలని పోలీసులు నిర్ణయించారట. ఇక, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో కాకాణి పిటిషన్, క్వాష్ పిటిషన్ లు దాఖలు చేశారు. వాటినూ హైకోర్టు ఈరోజు విచారణ జరపనుంది. కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.